తాడ్వాయి, అక్టోబర్7: సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం ఆధ్వర్యంలో మంగళ వారం ‘వన దేవతలకు మాటిద్దాం-మొక్క ముడుపు చెల్లిద్దాం’ అనే నినాదంతో ఒక వినూత్నమైన మొక్క ముడుపు అనే గ్రామ పండుగకు శ్రీకారం చుట్టనున్నారు. భక్తి, సంస్కృతీ సంప్రదాయాల ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా చేస్తున్న ప్రయత్నంలో మేడారం గ్రామం తొలి అడుగు వేయబోతోంది.
దీనిలో భాగంగా నార్లాపూర్, చింతల్క్రాస్రోడ్ వద్ద నేడు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమానికి ప్రజలంతా హాజరుకావాలని మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. అడవుల పునరుద్ధరణ, పాస్టిక్ వినియోగం, విష సంస్కృతిని తగ్గించేందుకు వన భోజన సంస్కృతిని ప్రపంచ పండుగలా పరిచయం చేస్తున్న గ్రామ పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదర్శవంతమైన సుస్థిర మేడారం దిశగా వేస్తున్న తొలి అడుగు ఈ చిరు ప్రయత్నంలో కుటుంబ సభ్యులందరితో తప్పకుండా పాల్గొనాలని ఆయన కోరారు.