ములుగురూరల్, జనవరి 24 : జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో త్వరలో తరగతులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ శరత్ అన్నారు. బుధవారం గట్టమ్మ దేవాలయం ఎదుట ఉన్న భూములను డిప్యూటీ రిజిస్ట్రార్(ఎస్టేట్) అభిషేక్, కేంద్రీయ విద్యాలయం రిజిస్ట్రార్ దేవిఏష్ నిగమ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్ వారికి మ్యాప్ ద్వారా భూముల వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా కార్యదర్శి శరత్ మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పాటుకు 337 ఎకరాల స్థలం సేకరించినట్లు చెప్పారు. దీనిని రెవెన్యూ అధికారులు గిరిజన సంక్షేమ శాఖకు బదలాయింపు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం ములుగు మండలంలోని జాకా రం యూత్ ట్రైనింగ్ సెంటర్ తాత్కాలికంగా తరగతులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట జాయింట్ డైరెక్టర్ కల్యాణ్‌రెడ్డి, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఏఈ నవీన్, తహసీల్దార్ విజయ్‌భాస్కర్, సర్వేయర్ సత్యనారాయణ ఉన్నారు.