తరిగొప్పుల, మే 22 : తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆధారంగా తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపకల్పన చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తరిగొప్పుల మండలంలోని నర్సాపురంలో పైపులైన్ పనులు, గండీరామారం పంప్‌హౌస్ వద్ద కొనసాగుతున్న దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-1 పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. పనులు వేగవంతం చేసి రైతులకు త్వరగా సాగునీరు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
జనగామ, హనుమకొండ జిల్లాల్లోని తరిగొప్పుల, చిల్పూర్, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సాగునీటి అందించేందుకు రూ.110కోట్లతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ పనులకు 2023 ఫిబ్రవరి 27న అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని పేరొన్నారు. తరిగొప్పుల మండలాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో గండీరామారం రిజర్వాయర్ ఆధారంగా రూ.63.80కోట్లతో లిఫ్ట్-1 ఇరిగేషన్ పథకాన్ని చేపట్టామని ఎమ్మెల్యే వివరించారు. దీని ద్వారా తరిగొప్పుల, అబ్దుల్‌నాగారం, నర్సాపూర్, అంకుషాపూర్, సోలిపురం, పోతారం, బొత్తగట్టునాగారం, భోజ్యతండా, జాల్బాయ్ తండా, మానిసింగ్తండా తదితర గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. తొలి దశలో 4 వేల ఎకరాలకు, భవిష్యత్‌లో మరో 10 వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
మరో రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తవుతాయని ఇంజినీర్లు తెలిపారని, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జూన్ 30లోపు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. జూలై 15లోపు ఇప్పటివరకు సాగునీరు అందని ఎత్తయిన ప్రాంతాలకు కూడా నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. తరిగొప్పుల మండలానికి నీళ్లు తీసుకురావడం తన అదృష్టంగా భావిస్తుస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో కూడా ఈ సమస్యను ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ పద్మానర్సింగరావు, సర్పంచ్‌లు భూక్యా రవి, దండెం శ్రీనివాస్, మంచినీళ్ల శ్రీనివాస్, బైకాని రమాబాలరాజు, సీనియర్ నాయకులు పింగిళి జగన్మోహన్రెడ్డి, అర్జుల సంపత్‌రెడ్డి, ముద్దసాని వెంకట్‌రెడ్డి, జొన్నగోని సుదర్శన్‌గౌడ్, తాళ్లపల్లి పోషయ్య, భూక్యా జూంలాల్‌నాయక్, దామెర ప్రభుదాస్, వంగ రామరాజు, తాళ్లపల్లి రాజేశ్వర్‌గౌడ్, నాగపురి భాస్కర్‌గౌడ్, సాయిల్ల రాజు, మాల్యాల సుధీర్, చింతల జైపాల్, తదితలు పాల్గొన్నారు.