మరిపెడ, మే 31 : పట్టణంలోని విద్యా హెర్బల్స్ మిర్చి ఫ్యాక్టరీలో సాంకేతిక లోపంతో పైపులైన్లు దెబ్బతిని కారంఘాటుతో కూడిన విషవాయువులు వెదజల్లడంతో గురువారం నుంచి ప్రజలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 10, 11, 12, 13, 14వార్డులతోపాటు ఆర్లగడ్డ తండా ప్రజలు హెర్బల్స్ ఫ్యాక్టరీ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా టెంట్ వేసి ఆందోళనకు ఉపక్రమిస్తున్న తరుణంలో పోలీసులు నిరసన తెలిపేందుకు అంగీకరించలేదు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కు లేకపోవడంతో ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. హెర్బల్స్ ఫ్యాక్టరీ వెదజల్లుతున్న విషవాయువులు, వ్యర్థాలతో గ్రామంలోని నల్ల చెరువు నీళ్లు కలుషితమయ్యాయని, పశువులు ఆ నీళ్లు తాగడం లేదని, మత్య్స సంపద దెబ్బతింటున్నదన్నారు.
విషవాయువుల ప్రభావంతో గుండెపూడి, వెంకంపాడు, మరిపెడ, ఆర్లగడ్డ తండావాసులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి సీఐ హథీరాం, ఎస్సైలు తహెర్‌బాబా, సంతోష్ చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. విషవాయువులు వెదజల్లకుండా సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు కౌన్సిలర్ ఎడెల్లి పరశురాములు, ముదిరెడ్డి వీరారెడ్డి, కుడితి వెంకటరెడ్డి, షేక్ అజీజ్, దేవరశేట్టి లక్ష్మీనారాయణ, బాలనాగు శివశంకర్, ముదిరెడ్డి పవన్‌రెడ్డి, కుడితి నర్సింహారెడ్డి, ఉప్పల సతీశ్, రమేశ్, దేవరశేట్టి కృష్ణమూర్తి, ఐనాల పరశురాములు పాల్గొన్నారు.