గీసుగొండ, మార్చి 7: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు మంగళవారం రాత్రి భక్తజనం పోటెత్తారు. ఉదయం హోలీ వేడుకలు జరుపుకున్న ప్రజలు.. సాయంత్రం స్వామి వారిని దర్శంచుకునేందుకు ఎడ్ల బండ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో జాతరకు భారీగా తరలివచ్చారు. నిండు పౌర్ణమిలో ఉప్పొంగిన భక్తి పారవశ్యంతో అధిక సంఖ్యలో తరలిరావడంతో ఒక్కసారిగా జాతర ప్రాంగణమంతా భక్తజనసంద్రంగా మారింది. భక్తులు తమ మొక్కలు చెల్లిచేందుకు ఎడ్ల బండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి భక్తిప్రభలను అందంగా ముస్తాబు చేసుకొని కోలాటాలు, లంబాడ నృత్యాలతో కోలాహలంగా వచ్చి.. స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామి వారికి పూర్ణహుతి, ధ్వజపట, ఉద్వాసన ప్రత్యేక పూజులు చేసిన అనంతరం లక్ష్మీనర్సింహస్వామి ఆలయ గుట్ట చుట్టూ ఎడ్లబండ్ల తిరిగే ఘట్టం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఈ ప్రాంతమంతా మార్మోగింది. దర్శనం అనంతరం భక్తులు గుట్ట చుట్టు ఉన్న ప్రాంతాల్లో విడిది చేసి వంటలు చేసుకొని భోజనాలు ఆరగించి తిరుగు పయనమయ్యారు. దర్శనం కోసం వెళ్లే భక్తులు ఆర్చీ నుంచి, తిరిగి ఇండ్లకు వెళ్లే భక్తులు సూర్యతండా మీదుగా వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఈస్ట్‌జోన్ డీసీపీ కరుణాకర్ పోలీస్ కంట్రోల్ రూం నుంచి మానిటరీంగ్ చేశారు. పరకాల ఏసీపీ శివరామయ్య, నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, గీసుగొండ సీఐ రాజుతోపాటు 250 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. జాతరలో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కుమారస్వామి, ఈవో శేషగిరి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సంజీవరెడ్డి భక్తులకు వసతులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా రాజకీయ ప్రభలు
జాతరలో రాజకీయ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గీసుగొండ మండలం నుంచి బీఆర్ఎస్కు చెందిన రెండు ప్రభ బండ్లతోపాటు మరో రెండు బండ్లు జాతరలో తిరిగాయి. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట మండలాల నుంచి రాజకీయ ప్రభబండ్లు భారీగా తరలివచ్చాయి. ప్రభలను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రభబండ్ల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. కాగా, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ప్రభబండ్లను కొమ్మాల స్టేజీ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామి వారి దర్శనం చేసుకోవాలని కోరారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నందున అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కొమ్మాల స్టేజీ నుంచి ఆర్చీ వరకు ఎమ్మెల్యే ప్రభబండి వెంట నడిచివచ్చి లక్ష్మీనర్సింహుడి దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్, మండల కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.