ములుగు : ఉద్యోగులకు పెండింగ్ బిల్స్‌ను ( Pending bills ) నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచాలని శనివారం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ( TGO Central Committee ) రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు( Yeluru Srinivas Rao ) మాట్లాడారు.
పెన్షనర్ల బకాయిలూ ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీపీ రిపోర్టును వెంటనే తెప్పించుకుని ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చి తెలంగాణ రెండవ పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానించామని వివరించారు.
ప్రభుత్వం ప్రకటించిన మేరకు ప్రభుత్వం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం విధి, విధానాలను వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్‌ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీంను పునరుద్దరన చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం.ఉపేందర్ రెడ్డి, కోశాధికారి సహదేవ్, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.