నల్లబెల్లి, జనవరి 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది అసమర్థ పాలన అని, పోలీసు నిర్బంధం మధ్య గ్రామ సభలు నిర్వహించడం సిగ్గుచేటని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. గ్రామ సభలు పెద్ద మాయ అని, ఎన్నికల స్టంట్ కోసమే రేవంత్ సర్కారు కుటిలయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. బుధవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసే ముందు గ్రామ సభలు నిర్వహించడం ఆనవాయితీ అని, కానీ గత ప్రభుత్వాలు వీటి కోసం పోలీసు బలగాలను వినియోగించలేదన్నారు.
నల్లబెల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన గ్రామ సభను పోలీస్ కమిషనర్ మినహా వరంగల్ జిల్లా పోలీసు యంత్రాంగం మధ్య నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అంతేగాక గొడవలు సృష్టించేందుకు ముందు రోజే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మండల కేంద్రంలో జరిగే గ్రామ సభకు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా, రేషన్‌కార్డులు, రుణమాఫీ, ఆత్మీయ భరోసాపై నాయకులు, అధికారులను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక పోలీసులను మోహరించి ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 400 రోజులు గడిచినా ఎందుకు హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించారు. అంతేగాక తాను మంజూరు చేసిన కోట్లాది రూపాయల పనులను ఎమ్మెల్యే మాధవరెడ్డి రద్దు చేశారన్నారు. అలాగే కేవలం లాభం వచ్చే పనులకు మళ్లీ టెండర్లు పిలిచి ఆయనే సొంతంగా పనులు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు.
చిత్తశుద్ధి ఉంటే రైతులకు రావాల్సిన రూ. 49 కోట్ల బోనస్ మంజూరు చేయాలని, అలాగే కన్నారావుపేట గ్రామంలో తాను మంజూరు చేసిన హార్టికల్చర్ రిసెర్చ్ స్టేషన్ పనులను ప్రారంభించాలన్నారు. ఇక ముందు తన జోలికి వచ్చే పోలీసులపై రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, మాజీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.