వరంగల్ చౌరస్తా, నవంబర్ 9 : పేరుకే 250 పడకల పెద్దాసుపత్రి అన్నట్లుగా ఉంది కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పరిస్థితి. శనివారం ఉదయం నుంచి హాస్పిటల్ అవసరాలకు చుక్క నీళ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటుగా ల్యాబ్‌ల్లో సేవలు సైతం నిలిచిపోయాయి. ఆరు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు మున్సిపల్ వాటరే దిక్కు. పెద్దాసుపత్రి అవసరాలకు తగినట్లు కనీసం బోరు కూడా లేదు. నిత్యం వందల మంది ఓపీ పేషెంట్లు, పదుల సంఖ్యలో అత్యవసర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందే ఇన్‌పేషెంట్లకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్‌కు కనీస నీటి వసతులు సమకూర్చుకోవడంలో వైద్యాధికారులు విఫలమయ్యారు.
నీరు లేకపోవడంతో కిడ్నీల సమస్య మూలంగా డయాలసిస్ చేయించుకునే పేషెంట్లు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. నగరంలోని ప్రధాన కూడలిలో నీటి పైప్ లైన్ మరమ్మతులు చేపడుతున్న కారణంగా శనివారం పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో మున్సిపల్ వాటర్‌పై ఆధారపడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చుక్క నీరు లేకుండాపోయింది. వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నీటి కొరత కారణంగా వైద్యసేవలు నిలిచిపోయిన విషయం బయట పడడంతో రాత్రి సుమారు 7గంటల ప్రాంతంలో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా నీటి సరఫరా కల్పించారు. నిత్యం వేల లీటర్ల వినియోగం ఉండే హాస్పిటల్‌కు శాశ్వత నీటి వసతిని ఏర్పాటు చేయకపోవడంపై రోగులు, అటెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.