గూడూరు, ఆగస్టు 21 : మహబూబాబాద్ జిల్లా గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) జ్వరపీడితులు, రోగులతో కిటకిటలాడుతున్నది. నిత్యం వందలాది మంది రోగులు దవాఖానకు జ్వరాలతో వస్తుండగా దవాఖానలో సరిపడా బెడ్లులేక ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల దవాఖానగా ఉన్నా అందుకు సరిపడా వైద్యులు లేక, పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు.
ఓపీ చూసిన తర్వాత ఇంజెక్షన్లు, మందులు తీసుకునేందుకు పై అంతుస్థులో ఉన్న ఇన్‌పేషంట్ వార్డుకు వెళ్లాల్సి వస్తున్నదని రోగులు ఆవేదనతో చెబుతున్నారు. అక్కడ గుంపులు గుంపులుగా ఇంజెక్షన్లు, మందుల కోసం రోగులు ఎగబడుతున్నారు. కొన్నిసార్లు కావాల్సిన మందులు దొరకక బయట కొనాల్సి వస్తున్నది. బెడ్స్ లేక ఒక్కోసారి బెడ్‌కు ఇద్దరు, ముగ్గురు చొప్పున చికిత్స తీసుకోవాల్సి వస్తున్నదని పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని, తగు వైద్య యంత్ర సామగ్రిని అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు.