కాశీబుగ్గ, జూన్ 25: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా కేఎంసీ ఎదుట జూడాలు కొద్దిసేపు ధర్నా నిర్వహంచారు. అనంతరం ర్యాలీగా ఎంజీఎం దవాఖానకు చేరుకొని ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఎంజీఎం దవాఖానలోని గాంధీ విగ్రహం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ వైద్యులకు సకాలంలో ఉపకార వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
నెల రోజుల క్రితమే తాము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, వైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని రకాల వైద్య సేవలకు తాము దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో సౌకర్యాలతోపాటు వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు. కేఎంసీలో అంతర్గత రోడ్లను బాగు చేయాలన్నారు. అలాగే, సూపర్‌స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న హాస్టల్ భవనాలు వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జూనియర్ డాక్టర్ల సమ్మెతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రి పరిధిలో జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్యులు, సూపర్‌స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా విధులకు దూరంగా ఉన్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందక ఇబ్బంది పడ్డారు. ఓపీ విభాగంలో రోగులు పెద్ద ఎత్తున క్యూలో వేచి ఉన్నారు.