ఖిలావరంగల్ : తన రెండు కాళ్లు పోయేందుకు కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గుర్రం శ్రీహరి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ ఆఫీస్ బేస్ క్యాంప్‌లో పనిచేస్తున్న సమయంలో కాలుకు కురుపైంది. దీంతో ములుగులో డాక్టర్ పోరిక రవీందర్ వద్ద ఐదేళ్ల క్రితం వైద్యం చేసుకోగా అది వికటించి కాలు తీసివేశారని తెలిపారు. నాలుగు నెలల క్రితం రెండో కాలుకు కూడా కురుపు కావడంతో మరోసారి డాక్టర్‌ను సంప్రదించానని తెలిపారు.
15 సార్లు తిరిగిన తర్వాత కూడా నయం కాకపోవడంతో పాటు కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ అయింది. ఓవర్‌డోస్ ఇంజక్షన్ వల్లనే కాళ్లు తీసేయాల్సి వచ్చిందని హనుమకొండకు చెందిన డాక్టర్లు స్పష్టం చేసినట్లు తెలిపారు. వచ్చిరాని వైద్యంతో వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఉద్యోగం చేస్తూ ములుగు జిల్లాలో దవాఖానను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. సొంత ఇల్లు లేదని, భార్య కూలి పని చేస్తేనే కుటుంబం గడుస్తుందని తన ఆవేదనను కలెక్టర్‌కు చెప్పుకున్నారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.