మహబూబాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్ పనుల్లో భాగంగా నాన్ ఇంటర్ లాకింగ్ కోసం ఇప్పటికే పలు రైళ్ల ను అధికారులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కాజీపేట నుంచి విజయవాడకు వెళ్లే పుష్పుల్ రైలుతో పాటు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ఇంటర్సిటీ, శాతవాహన, గోల్కొండ రైళ్లను రద్దు చేశారు. ఇలా పలు రైళ్లను రద్దు, మానుకోట రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్ప డం లేదు. మహబూబాబాద్‌లో ఆగే 17 రైళ్లను తాత్కాలికంగా కేసముద్రం రైల్వేస్టేషన్లలో ప్రత్యేక హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మూడో లైన్ పనుల వల్ల మానుకోట స్టేషన్లో రైళ్లు ఆగవని రైల్వేస్టేషన్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
నిత్యం వేలాదిగా రాకపోకలు..
మానుకోట జిల్లాకేంద్రమైన తర్వాత వ్యాపార, వాణిజ్యపరంగా రవాణా విపరీతంగా పెరిగింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇక్కడినుంచి వరంగల్, కాజీపేట, హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, విజయవాడ, గుం టూరుకు వేలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో రోజూ నడిచే రైళ్లలో కొన్ని రద్దు కావడం, మరికొన్ని రైళ్లు నడిచినా మానుకోటలో హాల్టిం గ్ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
సోమవారం ఉదయం ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మానుకోట రైల్వేస్టేషన్లలో జరుగుతున్న పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. అలాగే రెండో నంబర్ ప్లాట్ఫారం వైపు మరో ప్లాట్ఫారం నిర్మించాలని సూచించారు. సోమవారం తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను ప్లాట్ఫారం దాటి రైల్వే గేట్ సమీపంలో ఆపడంతో ప్లాట్‌ఫారంపై ఉన్న ప్రయాణికులు ఉరుకులు పరుగులు తీయా ల్సి వచ్చింది.
అలాగే నాగర్సోల్ రైలును ప్లాట్ఫారం ఉండే లైను కాకుండా మెయిన్ లైనులో కొద్దిసేపు నిలిపారు. దీంతో ప్లాట్ ఫారం మీద ఉన్న ప్రయాణికులు కిం దికి దిగి రైలు ఎక్కాల్సి వచ్చింది. బుకింగ్‌లో టికెట్లు ఇవ్వకుండా, స్టాప్ లేదని చెప్పినా వినకుండా ప్రయాణికులు ప్లాట్ఫారం మీద వందలాది వేచిచూస్తున్నారని, రైల్వే అధికారులు చెబుతుండగా, స్టాఫ్ లేకుంటే కేసముద్రం రైల్వేస్టేషన్ దాకా ఎలా వెళ్లాలని, అది తమకు అదనపు భారమేనని ప్రయాణికులు ఆవేదనతో చెప్పారు.