కాజీపేట, ఫిబ్రవరి 23 : ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో సందడిగా ఉండే కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ వెలవెలబోతున్నది. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నప్పటికీ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా నిరుపయోగంగా మారింది. ఈ స్టేషన్లో నిలిచే మెము రైలును రద్దు చేయడం, సింగరేణి హాల్టింగ్‌ను ఎత్తివేయడంతో ప్రస్తుతం బోసిపోయింది. గతంలో కాజీపేట మీదుగా బల్లార్ష, విజయవాడ, సికింద్రాబాద్‌కు నడిచే ప్రతి రైలు కాజీపేట జంక్షన్‌కు వచ్చిన తర్వాతనే గమ్యస్థానాలకు వెళ్లేవి. కాజీపేట జంక్షన్ మీదుగా రైళ్ల సంఖ్య పెరిగి, స్టేషన్‌పై భారం ఎక్కువ కావడంతో అప్పటి సీమాంధ్ర రైల్వే అధికారులు ఫాతిమానగర్ బ్రిడ్జి కింద నుంచే వరంగల్ స్టేషన్‌కు రైళ్లు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి బీఆర్ఎస్ హనుమకొండ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు భవిష్యత్‌లో ప్రాముఖ్యత తగ్గుతుందని గుర్తించి టౌన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డుపై ఒత్తిడి పెంచారు. దీంతో రైల్వేబోర్డు దిగొచ్చి 2007లో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేసి సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌ను దీని మీదుగా నడిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు పెద్దపల్లి – మహబూబాబాద్ – పెద్దపెల్లి మధ్య మెము రైలును ప్రవేశ పెట్టి, ఆపై విజయవాడ వరకు పొడిగించారు. ప్రతిరోజు ఈ స్టేషన్లో సింగరేణి, మెము రైళ్లు ఆగడం, వీటికి జనరల్ బోగీలుండడంతో ప్రతిరోజు సామాన్య ప్రజలు, దినసరి కూలీలు ప్రయాణించేవారు.
మెము రైలు రద్దు..
రెండున్నరేళ్ల క్రితం మెము రైలును రద్దుచేయగా, పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల కారణంతో సింగరేణికి ఇటీవల హాల్టింగ్‌ను ఎత్తివేశారు. దీంతో ఈ రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణిలో వెళ్లాలంటే అనివార్యంగా వరంగల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తున్నదని వాపోతున్నారు. తమ ఇబ్బందులను గమనించి రద్దు చేసిన మెము, హాల్టింగ్ ఎత్తివేసిన సింగరేణిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ-బల్లార్ష సెక్షన్లో ఇరువైపులా ఏమైనా రైళ్లు వెళితే లైన్ క్లియర్ అయ్యే వరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, గూడ్స్ రైళ్లను ఈ స్టేషన్లో అధికారులు నిలుపుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ట్రయాంగిల్ ప్లాట్‌ఫాం స్టేషన్ ఏర్పాటై ఢిల్లీ, చెన్నైల మధ్య నడిచే ప్రయాణికుల రైళ్లు ఆగుతాయని భావించిన ఇక్కడి ప్రజల ఆశలు అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆవిరయ్యాయి.
ఉపాధి కోల్పోయాం
టౌన్ స్టేషన్ల్లో మె మొ రైలు రద్దు, సింగరేణి హాల్టింగ్ ఎత్తివేతతో చాలా మంది ఆటో డ్రైవ ర్లం ఉపాధి కోల్పోయాం. టౌన్ స్టేషన్ ఆటో అడ్డా నుంచి దాదాపు యాభై మందిమి ఆటోల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ వచ్చే డబ్బులతో జీవనం సాగించేవా ళ్లం. ఇప్పుడు మా పరిస్థితి చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం రోడ్లపై ఆటోలు ఎక్కేటోళ్లు కరువైండ్రు.
– భుక్యా శంకర్ నాయక్, ఆటో యూనియన్ నాయకుడు, కాజీపేట
ట్రయాంగిల్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలి..
కాజీపేట టౌన్ స్టేషన్ ప్రాంతంలో ట్రయాంగిల్ ఫ్లాట్‌ఫాం స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి. ఢిల్లీ-చెన్నై మార్గంలో నడిచే రైళ్లు కాజీపేటకు రాకుండా పోతున్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలో నిట్, కేయూ, జిల్లా కోర్టు, కలెక్టర్ కార్యాలయం, కేఎంసీ, ఐటీ కంపెనీలు, పేరొందిన దర్గా, చర్చి, దేవాలయాలతో పాటు దవాఖానలు, విద్యా సంస్థలు, రైల్వే ఈఎల్ఎస్, డీఎల్ఎస్, వ్యాగన్ తదితర సంస్థలున్నాయి. ఎంపీలు, మంత్రులు చొరవ తీసుకొని అన్ని విధాలా సౌకర్యంగా ఉన్న కాజీపేట టౌన్ స్టేషన్‌ను ట్రయాంగిల్ ప్లాట్‌ఫాం స్టేషన్‌గా తీర్చిదిద్ది, అన్ని రైళ్లు ఆగేలా చర్యలు చేపట్టాలి.
– శివకుమార్, కాజీపేట