మహదేవపూర్/భూపాలపల్లి రూరల్, జూన్ 9 : మహదేవపూర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. వివరాలి లా ఉన్నాయి.. ఎలేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి నాగరాజు(23) తన తల్లి సరోజనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మండల కేంద్రంలోని ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాడు.
గత కొన్ని రోజులుగా నీకు ఆకలిగా లేదని, నువ్వు కూడా వైద్యం చేయించుకోమని నాగరాజుకు తల్లి సూచించడంతో పరీక్షలు చేయించుకొని గ్లూకోజ్ ఎకించుకున్న కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే వైద్యులు జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి నాగరాజు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు.
వైద్యం వికటించే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై డాక్టర్ని వివరణ కోరగా నాగరాజు కొన్ని రోజులుగా వికారం, విరోచనాలు, కడుపులో మంట ఉందని చెప్పగా, దానికి ట్రీట్మెంట్ చేస్తుండగా ఫిట్స్ వచ్చి పరిస్థితి విషమంగా ఉండడంతో భూపాలపల్లి ఆసుపత్రికి రెఫర్ చేశామన్నారు. మహ దేవపూర్ ప్రభుత్వ దవాఖానలో వైద్యం వికటించి తన కొడుకు మృతిచెందాడని మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఎల్కేశ్వరం గ్రామస్తులు, మృతుడి బంధువులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మృతుడి తమ్ముడు సాగర్, బంధువు లు మాట్లాడుతూ నాగరాజుకు వైద్యులు స్లైన్ పెట్టి అందులో సూదితో మందు కలపగా ఒకే సారి అరుస్తూ నురుగలు కక్కుతూ వాంతులు చేసుకున్నాడని అన్నారు. వెంటనే అంబులెన్స్‌లో భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి పంపించారని తెలిపారు.
నాగరాజు మృతికి కారకులైన డాక్టర్లు, వైద్య సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డి మాండ్ చేశారు. మహదేవపూర్, భూపాలపల్లి ఎస్సైలు పవన్‌కుమార్, సుధాకర్, సాంబమూర్తిలు కలెక్టరేట్‌కు చేరుకుని మృతుడి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడారు. పోస్టుమార్టం అనంతరం వచ్చిన రిపోర్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.