వరంగల్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) ;హైదరాబాద్లో ఈనెల 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమానికి ప్రజలు తరలివెళ్లేందుకు వరంగల్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 300 మందిని తీసుకెళ్లేందుకు 6 బస్సులను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, నర్సంపేటకు ఆర్డీవో శ్రీనివాసులు, వర్ధన్నపేటకు డీపీవో కల్పనను నోడల్ అధికారులుగా నియమించారు. భోజన ఏర్పాట్ల ఇన్చార్జి బాధ్యతలను డీఆర్డీవో ఎం సంపత్రావుకు కలెక్టర్ అప్పగించారు.
బీఆర్ఎస్కు బలం, బలగం కార్యకర్తలేనని, వారి కృషితోనే పార్టీ మనుగడ సాధిస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని, దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోందని, దీంతో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. సీఎం ప్రజల కోసం ఆలోచిస్తూ అభివృద్ధి చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీ గురించి ఆలోచిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. బీజేపీ నాయకులు కులమతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తుంటే.. దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని చెప్పారు. ప్రజాధనాన్ని అంబానీ, అదానీని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే
రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం చేపట్టనున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆ దిశగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఉమ్మడి పాలనలో జరిగిన అభివృద్ధితో పోల్చి ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికి గుర్తింపు ఉంటుందని వివరించ్నారు. అపదవుల కోసం కాకుండా పార్టీ బలోపేతం గురించి ఆలోచించాలని, పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు వాటంతట అవే వస్తయని అన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పి కొట్టాలని, ప్రజలకు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. పార్టీని మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్లేనని గుర్తుంచుకోవాలన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, పట్టణ సమన్వయ కమిటీ నాయకులు చందుపట్ల రమణారెడ్డి, ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి, పావుశెట్టి వెంకటేశ్వర్లు, నిప్పాని సత్యనారాయణ, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ వార్డు కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.