హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 2 : దివంగత పందిళ్ల శేఖర్‌బాబు స్మారక జాతీయ నాటకోత్సవాలు హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాలను చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలిరోజు నిర్వహించిన నాటక ప్రదర్శనలు ఆహూతులను ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ నాటక రంగానికి దివంగత పందిళ్ల శేఖర్‌బాబు చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆ మహానుభావుడి పేరిట ఐదేళ్లుగా స్మారక నాటకోత్సవాలు నిర్వహించి కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు.నాటక రంగం కోసం అహర్నిశలూ కృషి చేసి, ఎన్నో రంగస్థల ప్రదర్శనలతో తనతో పాటు అనేకమంది నాటక కళాకారులను ప్రోత్సహించి, శిక్షణ ఇచ్చి, అత్యుత్తమ కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత శేఖర్బాబుకే దకుతుందన్నారు.
నాటకాలే ప్రాణంగా భావించి తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహానుభావుడి ఆత్మకు ఏటా నిర్వహించే ఈ నాటకోత్సవాల వల్ల శాంతి కలుగుతుందన్నారు. శేఖర్‌బాబుతో తనకున్న అనుబంధాన్ని వినయ్‌భాస్కర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ మాట్లాడుతూ ఓరుగల్లు కళలకు నిలయమన్నారు. కళాకారుల కోసం సీఎం కేసీఆర్ రూ.75 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారని చెప్పారు. త్వరలో దాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందులో సుమారు 1500 మంది వరకు కూర్చొని వీక్షించవచ్చన్నారు. కళాకారులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పురసారాన్ని రచయిత, దర్శకులు, నటులు జీవీ బాబుకు ప్రదానం చేశారు. అలాగే, వేముల ప్రభాకర్‌ను ఘనంగా సన్మానించారు. కమిటీ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంతరావు అధ్యక్షత వహించగా ఆత్మీయ అతిథులుగా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కటకం పెంటయ్య, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం, సంజీవరెడ్డి, శ్రీరామోజు సుందరమూర్తి, కటకం పెంటయ్య, పందిళ్ల శేఖర్‌బాబు సోదరులు పందిళ్ల రమేష్‌బాబు, పందిళ్ల అశోక్, కమిటీ ప్రధాన కార్యదర్శి ఆకుల సదానందం, బోయినపల్లి పురుషోత్తంరావు, చక్రపాణి, తిరుమలయ్య, బాలాజీ, రమేశ్, రవీందర్రావు, నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆలోచింపజేసిన నాటకప్రదర్శనలు
గోపరాజు విజయ్ దర్శకత్వంలో శ్రీసాయి ఆర్ట్స్ కొంకలూరు వారు ప్రదర్శించిన గమ్యస్థానాలవైపు నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. నటీనటులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అనంతరం వరంగల్ స్టార్ బ్రదర్స్ సాంసృతిక కళాపరిషత్ వారి విజయనిరుద్ధం పౌరాణిక పద్యనాటకం ప్రదర్శించారు. అబ్బురపరిచే సెట్టింగ్స్, లైటింగ్‌తో ఆద్యాంతం పద్యనాటకం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నాటికకు రచన డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి కాగా, దేవరాజు రవీందర్రావు దర్శకత్వం వహించారు.