జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 28 : జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి గులాబీ జెండా ఎగరరేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగామ, చేర్యాల మున్సిపాల్టీలు సహా అన్ని మండలాల్లో గెలుపు మాదేనని, ఎన్నికలు ఏదైనా జనగామలో బీఆర్ఎస్ను ఢీకొట్టే దమ్ము, శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిన కొన్ని చోట్ల మాకు మేమే పోటీపడ్డం తప్ప మమ్మల్ని ఎవరూ ఓడించలేదన్నారు.
జిల్లాలో 60 శాతం సర్పంచి సీట్లు, 70 శాతం వార్డు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తన సొంతూరిలో వారం రోజులు తిష్ట వేసి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి బెదిరించినా నర్సాయపల్లి, అత్తగారి ఊరి గంగాపురంలో ఓటమి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. మేం గెలుచుకున్నవి కూడా కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా ప్రకటించుకుంటుందని మండిపడ్డారు.
ఇటీవల సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన కొమ్మూరి ఏ ప్రొటోకాల్ ఉందని సర్పంచ్ కుర్చీలో సిగ్గుఎగ్గూలేకుండా ఎలా కూర్చుంటావని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్సీగా తాను మంజూరు చేయించిన నిధులతో పనులు జరిగితే తనకు పేరొస్తుందనే రాజకీయ అక్కసుతో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పనులను అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యాడని ఎమ్మెల్యే పల్లా మండిపడ్డారు. కొమ్మూరి నీకు దమ్ము.. తెలివి ఉంటే తాను మంజూరు చేయించిన బండనాగారం-కటూర్, సుందరయ్యనగర్ రోడ్డును పూర్తి చేయించని పేర్కొన్నారు. పైసలు తీసుకొని రెండు మార్కెట్ పదవులు, ఆలయ చైర్మన్ పదవు లను అమ్ముకున్న ఘనత కాంగ్రెస్ వాళ్లదని ఆరోపించారు.
తరిగొప్పులకు పోయి నీళ్లు నేనే తెచ్చిన అంటున్నావ్.. కొమ్మూరి.. నీకు సిగ్గుండాలి కదా.. ఇంకా నీళ్లు రాలేదు.. వస్తే తెచ్చేది పల్లా రాజేశ్వర్ రెడ్డి తప్ప నీ మొహం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నీళ్లు, నిధులు, రోడ్లు తెచ్చే సత్తా నా దగ్గర ఉందని, నువ్వు అడ్డు పడినా వచ్చే సీజన్ వరకు తరిగొప్పులకు నీళ్లు తెచ్చి తీరుతానని పల్లా స్పష్టం చేశారు.
ఏమైనా మాట్లాడితే దొంగఓట్లతో గెలిచాడని అంటున్నావ్.. నిజానికి దొంగ ఓట్లు నీవి.. నీ కొడుకులు, కోడళ్లు, నీ పేర్లు నాలుగు చోట్ల ఓట్లు ఉంటాయ్.. నేను 17వేలకు పైగా ఓట్లతో గెలిచిన.. నువ్వు కనీసం నీ సొంతూరిలో సర్పంచ్‌గా, వార్డు సభ్యుడిగా గెలువలేకపోయావ్..నీకు దమ్ముంటే నాతో పోటీ పడు..మా కార్యకర్తలకు కండువాలు కప్పడం ఇకనైనా ఆపు అని అన్నా రు. నర్మెటలో డబ్బులు, మద్యం పంచి ఓ లిక్కర్ డాన్ స ర్పంచ్‌గా గెలిచి అడ్డదారిలో ఫోరం అధ్యక్షుడు అయ్యేందుకు బీఆర్ఎస్ సర్పంచ్‌లను ప్రలోభ పెట్టావని, దళితుడైన ఆంజనేయులును ఎన్నుకో వద్దని మభ్యపెట్టాడని ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట, జనగామ సర్పంచుల ఫోరం అధ్యక్షుతుడి కంతి ఆంజనేయులు, మల్లయ్య, ఫోరోజ్, కాయిదాపు రం రామ్మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.