హనుమకొండ, జనవరి 7 : జిల్లా మంత్రులు లేకుండానే ఉమ్మడి జిల్లాపై సమీక్ష జరిగింది. బుధవారం హ నుమకొండ కలెక్టరేట్లోఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మంత్రి సీతక్క సైతం రెండో దశ సమావేశానికి మొక్కుబడిగా హాజరయ్యారు. సమావేశంలో జిల్లా యంత్రాంగం, అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పార్టీలకతీతంగా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు.
యూరియా పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌పై, తన శాఖ సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు వస్తుంటే మీరు ఏం చేస్తున్నా రంటూ.. ప్రత్యేకంగా మీ పనితీరు మార్చుకొని మ రింత మెరుగ్గా పనిచేయాలని మందలించారు. అనంత రం శ్రీనివాస్‌రెడ్ది విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ఎస్టిమేట్, డీపీఆర్‌లు సిద్ధ్దం చేయాలని ఆదేశించామన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, టూబీ హెచ్‌కె ఇం డ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీన మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని, 19వ తేదీన గద్దెల పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం జాతర నిర్వహణకు 6 నెలల క్రితం రూ. 100 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా, గద్దెల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ పీడీ వీఐఈ గౌతం, కలెక్టర్లు స్నేహాశబరీష్, సత్యశారద, రాహుల్, షేక్ రిజ్వా న్ బాషా, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయి, శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతులందరికీ ఒకేసారి యూరియా ఇవ్వాలి
రైతులందరికీ ఒకేసారి యూరియా అందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇన్ చార్జి మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూ రియా విషయంలో యాప్, కార్డు ద్వారా పంపిణీ చేయాలనే ప్రయత్నాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. జనగామలో యాప్ అని, చేర్యాలలో కార్డు ద్వారా అంటున్నారని తెలిపారు. అంతేకాక ఐదెకరాలున్న రైతుకు ఒకసారి రెండు, మరోసారి 3 ఇస్తామని అంటున్నారని, అలాకాకుండా అవసరమున్నంత మేరకు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు జరగాలన్నారు. అలాగే జనగామ రోడ్డు, బ్రిడ్జికి సంబంధించి పెండింగ్ బిల్లుతో పాటు, ఇబ్బందికరంగా మారిన చీటకోడూరు బ్రిడ్జి మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే పల్లా తెలిపారు.