హనుమకొండ సబర్బన్, ఆగస్టు 22 : చేతినిండా పనులు లేక వలసకూలీలు విలవిలలాడుతున్నారు. ప్రతి సీజన్లో వరినాట్లు వేసేందుకు భారీ ఎత్తున వచ్చే కూలీల్లో ఈసారి పావులవంతు కూడా రాలేదు. వచ్చిన వారికి పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సూమారు 6 నుంచి 7 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగుచేస్తారు. గతంలో పుష్కలంగా సాగునీరు ఉండడంతో అన్నదాతలు పెద్ద ఎత్తున ఖుష్కి పంటలను వదిలి వరివైపు మొగ్గు చూపారు. అయితే, స్థానికంగా వరి నాట్లు వేసే నైపుణ్యం ఉన్న కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఇతర రాష్ర్టాల వైపు దృష్టిసారించారు.
మొదట్లో బీహార్ నుంచి, కాలక్రమేణా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి 30 వేల మంది వరకు కూలీలు వరి నాట్లు వేసేందుకు ఉమ్మడి జిల్లాకు వచ్చేవారు. ఇందుకు భిన్నంగా ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడగా, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కూలీల సరఫరా ఏజెంట్లు తక్కువ మందిని తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సూమారు 5 నుంచి 6 వేల మంది మాత్రమే ఇతర రాష్ర్టాల నుంచి వచ్చారు. వారికి కూడా పూర్తిస్థాయిలో పనులు దొరకడం లేదు. గతంలో ఈ సీజన్లో రెండు నెలల పాటు వరినాట్లు ముమ్మరంగా సాగేవి. ఉదయం చీకటితోనే పొలాలకు చేరుకునే కూలీలు రాత్రి అయితే గానీ ఇంటికి చేరేవారు కాదు. అట్లాంటిది ఈసారి మాత్రం రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో నీటి లభ్యతను బట్టి సగం వరకే వరినాట్లు వేస్తున్నారు.
దీంతో ఒకే చోట రోజంతా పని దొరక్క పంట క్షేత్రాల మధ్య ప్రయాణాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నదని అతిథి కూలీలు వాపోయారు. మొదట్లో పూర్తిగా నత్తనడకన వరినాట్లు సాగగా, జూలై చివరి వారంలో కురిసిన వానల వల్ల మరికొంత విస్తీర్ణం పెరిగింది. అయినా, వలస కూలీలకు మాత్రం పూర్తిస్థాయిలో పనులు దొరకలేదు. నిత్యం సుమారు ఒక్కో కూలీ రూ. 1000 నుంచి రూ. 1200 వరకు సంపాదించుకునేవారు. ప్రతి సీజన్లో ఒక్కొక్కరు సుమారు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు సంపాదించుకొని సంబురంగా ఇతర ప్రాంతాలకు నాట్లు వేసేందుకు బయలుదేరేవారు. ఈ సారి మాత్రం ఇతర రాష్ర్టాల్లో కూడా వర్షాల పరిస్థితి ఇలాగే ఉండడంతో నిరాశతో తమతమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు.
నేను గత ఐదేళ్లుగా ఇక్కడ వరినాట్లు వేసేందుకు వస్తున్న. ఎప్పుడు కూడా ఇంత తక్కువ డబ్బులు రాలేదు. ప్రతి సీజన్లో ఇక్కడ సంపాదించిన డబ్బులతో మా కుటుంబాలను సాదుకునేది. మేము నాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచే మంచిగా బతుకుతున్నాము. కానీ, ఈ ఏడాది తక్కువ డబ్బులు వచ్చాయి. మాకు ఇప్పుడు కొంత ఇబ్బందిగా ఉంది.
– సెలుక ముర్ము, కూలీ, పశ్చిమబెంగాల్
నేను ప్రతి పంట సీజన్లో నా సొంత భూమితోపాటు ఇతరుల పొలాల్లో కూడా వరినాట్లు వేసేందుకు నాలుగైదు కూలీ బ్యాచ్లను తీసుకొచ్చేవాడిని. మా ఊళ్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాట్లు వేయించేవాడిని. ఈసారి వర్షాలు లేకపోవడంతో ఒక్క బ్యాచ్నే తీసుకొచ్చిన. వాళ్లకు కూడా పూర్తిస్థాయిలో పనులు దొకలేదు. దీంతో వారు తిరిగి వెళ్తున్నారు.
– కడిపికొండ పట్టాభిరెడ్డి, రైతు, గంటూరుపల్లి