వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 6 : ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కొందరు యూనియన్ నాయకులు అమ్మకానికి పెట్టారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులకు ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికిన ఓ యూనియన్ ఎంజీఎం విభాగం నాయకులు కొందరు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. ఇటీవల ఔట్సోర్సింగ్ సంస్థ కాంట్రాక్టు సమయం గడిచిపోవడంతో కొత్తగా కాంట్రా క్టు తీసుకోవడానికి ముందు యూనియన్ నాయకులు సూచించిన కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాంట్రాక్టు సంస్థ నిర్వాహకులను డిమాండ్ చేశారు.
అందుకు సంస్థ అంగీకరించకపోవడంతో జిల్లాస్థాయి యూనియన్ నాయకుడిని రంగంలోకి దించారు. అసలు విషయం చెప్పి యూనియన్ తరఫున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఔట్సోర్సింగ్ సంస్థపై ఒత్తిడి చేశారు. కాంట్రాక్టు సంస్థ అంగీకరించడకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. విషయాన్ని ఎంజీఎంహెచ్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ నివాస వైద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడే అసలు కథ మొదలయ్యింది.
కాంట్రాక్టు సంస్థకు చెందిన ఉద్యోగిని పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పంపించారు. యూనియన్ నాయకుడితో కలిసి చక్రం తిప్పిన వైద్యాధికారి ఔట్సోర్సింగ్ సంస్థ నిర్వాహకులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. యూనియన్ నాయకులు సూచించిన వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేకపోతే బిల్లు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తప్పవని బెదిరింపులకు పాల్పడడంతో సదరు కాంట్రాక్టు సంస్థ భారీ మొత్తం లో ముడుపులు అప్పజెప్పి శాంతింపజేసినట్లు కార్మికులు గుసగుసలాడుతున్నారు.
ఔట్సోర్సింగ్ సంస్థ నుంచి వసూలు చేసిన డబ్బుల పంపిణీలో సదరు యూనియన్ నాయకుడికి, నివాస వైద్యాధికారికి చెడడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఇద్దరు వ్యక్తులు కిమ్మనకుండా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. ఉద్యోగాలు పెట్టిస్తామని అక్రమంగా వసూలు చేసిన ఎంజీఎంహెచ్ విభాగం యూనియన్ నాయకులకు మొండిచెయ్యి చూపించడంతో పిల్లి పిల్లి కొట్లాడితే కోతికి సందు దొరికినట్లయ్యిందని లబోదిబోమంటున్నారు.
ఉద్యోగాల కోసం నగదు చెల్లింపులు చేసిన యువకులు యూనియన్ నేతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పని కాకపోవడంతో నగదు చెల్లింపులు చేసిన కొందరు నిరుద్యోగులు తమ ఉద్యోగాల విషయంపై వసూళ్లకు పాల్పడిన యూనియన్ నాయకులతో ఎంజీఎంహెచ్ ఆవరణలోనే వాదనకు సైతం దిగినట్లు కొందరు సిబ్బంది చెబుతున్నారు. ప్రాణాలు నిలిపేందు కు వైద్యం చేయాల్సిన దవాఖానలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న యూనియన్ నాయకులపై, బెదిరింపులకు పాల్పడి అక్రమ వసూ ళ్లు చేస్తున్న వైద్యాధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.