జనగామ, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాబడి అధికంగా ఉన్న శాఖల్లో పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారులు ఏరి.. కోరి.. మళ్లీ జనగామకే వస్తున్నారు. ఇక్కడ ఎక్కువ కాలం విధులు నిర్వర్తించి వెళ్లినా ఇదే స్థానాన్ని కోరుకోవడంలో మతలబేమిటోననే గుసగుసలు వినిపిస్తున్నాయి. జనగామ సబ్ రిజిస్ట్రార్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన అమ్జద్ అలీ లాంగ్ స్టాండింగ్ నెపంతో మహబూబాబాద్‌కు బదిలీపై వెళ్లి అక్కడ 10 నెలలు పనిచేశారు. తర్వాత వరంగల్‌కు వచ్చి.. పలు కారణాలతో స్టేషన్‌ఘన్‌పూర్‌కు పోస్టింగ్ వేయించుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో తిరిగి జనగామ రిజిస్ట్రార్‌గా ఆయన రావడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి వివాదాస్పదమైన అమ్మకాలు, కొనుగోళ్ల డాక్యుమెంట్లు అయినా ‘మాట్లాడుకొని’ ఫైల్ ముందుపెడితే క్లియర్ చేయడంలో అమ్జద్ అలీ తర్వాతనే ఇంకెవరైనా అనే స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. జనగామలో అంతగా పాతుకుపోయిన ఆయనే మళ్లీ రావడంతో రియల్టర్లు, అమ్మకం, కొనుగోలుదారులు, మధ్యవర్తులు పండుగ చేసుకుంటున్నారు. అమ్జద్ అలీ ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత పనిచేసిన ఇద్దరు, ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు ‘వామ్మో ఇవి మావల్ల కావు.. ఉద్యోగాలు పోతాయ్’ అంటూ భయపడి పక్కకు పడేసిన ఫైళ్లను దుమ్ముదులిపి సార్‌తో మాట్లాడి ముందు పెట్టేందుకు డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు, రియల్టర్లు సిద్ధపడుతున్నారు. అటు, ఇటు తిరిగిన అమ్జద్ అలీ జనగామలో పోస్టింగ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధితో పైరవీ చేయించుకొని కోరి మరీ బదిలీ ఆర్డర్ తెచ్చుకున్నారనే చర్చ జరుతున్నది.