ఖానాపురం, ఏప్రిల్ 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గొంది నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. మండలంలోని మంగళవారిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం మేరకు కేంద్ర, రాష్ర్టాల పోలీస్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. ఈ క్రమంలో ఆదివాసీ గూడేల్లో నివసిస్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఆదివాసీల జీవితం అడవితో మమేకమై ఉంటుందన్నారు. వారిని అడవుల్లోకి వెళ్లనివ్వకుండా, వ్యవసాయ పనులు చేసుకోకుండా పోలీసులు నిత్యం వేధిస్తున్నారని విమర్శించారు. దీంతో వారు సాధారణ జీవితం గడపలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల స్పేచ్ఛను హరిస్తున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గొంది నర్సయ్య, చింత రమణయ్య, కంగల ఉపేందర్, కిరణ్, మల్లెల శ్రీను, చింత సంజీవ, వెంకన్న పాల్గొన్నారు.