నర్సంపేట రూరల్, డిసెంబర్ 17 : జిల్లాలోని క్రిస్టియన్లకు పంపిణీ చేసేందుకు క్రిస్మస్ కానుకలు వచ్చాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆర్డీవోల చేతులమీదుగా, కుల పెద్దల సమక్ష్యంలో ఈ గిఫ్ట్‌ప్యాక్‌లను పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నియోజకవర్గాల పరిధిలోని క్రిస్టియన్లకు అతిత్వరలోనే కానుకలు అందించనున్నారు. ప్రతి డివిజన్‌కు 1000 గిఫ్ట్‌ప్యాక్‌ల చొప్పున వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డివిజన్‌కు రూ. 2 లక్షల విలువైన వెయ్యి గిఫ్ట్‌ప్యాక్‌లు ఇప్పటికే నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ నియోజకవర్గాల్లోని హెడ్‌క్వాటర్ తాసిల్దార్ కార్యాలయాలకు చేరుకోగా రెవెన్యూ సిబ్బంది భద్రపరిచారు. ఈ నెల 20లోగా అన్ని డివిజన్లలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఆయా మండలాల్లో ఉన్న చర్చీలు, నిరుపేద క్రిస్టయన్ల వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. ఈ నెల 18 నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల చేతులమీదుగా పంపిణీని ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలకు దుస్తులు, ఇతర కానుకల కోసం రూ. 33 కోట్ల నిధులు విడుదల చేయడంపై క్రిస్టియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట డివిజన్లో చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, దుగ్గొండి మండలాల క్రిస్ట్టియన్లకు పెద్ది చేతుల మీదుగా అందించనున్నారు. నర్సంపేట మండలానికి రూ. 80 వేల విలువ గల 300 గిఫ్ట్‌ప్యాక్‌లు, చెన్నారావుపేటకు రూ. 26 వేల విలువైన 160, నెక్కొండకు రూ. 26 వేల విలువైన 160, ఖానాపురానికి రూ. 21 వేల విలువైన 110, నల్లబెల్లికి రూ. 21 వేల విలువైన 110, దుగ్గొండి మండలానికి రూ. 26 వేల విలువైన 160 గిఫ్ట్‌ప్యాక్‌లు వచ్చాయి.