ములుగు, డిసెంబర్14 (నమస్తేతెలంగాణ) : ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన ప్రతి అడుగూ అభివృద్ధి వైపు ఉంటుందని తెలిపారు. మరోసారి ఎమ్మెల్యేగా ఆదరించి ఆశీర్వదించిన ములుగు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మల దీవెనలతో రాబోయే రోజుల్లో ములుగును మరింత అభివృద్ధి చేసుకోనున్నట్లు వివరించారు. కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతక్కకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.