హనుమకొండ, జూన్ 27: టీజీఎన్పీడీసీఎల్ నూతనంగా నియమించిన డైరెక్టర్లు శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్తు భవన్ కార్పొరేట్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. వీరిలో ఫైనాన్స్ డైరెక్టర్ వి. తిరుపతి రెడ్డి, ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. మోహన్ రావు, హెచ్ఆర్డీ డైరెక్టర్ సి. ప్రభాకర్ ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసారు. సీఎండీ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నూతన డైరెక్టర్లు మాట్లాడుతూ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సారధ్యంలో కంపెనీ పురోభివృద్ధిలో భాగస్వాములవుతామని, వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కాగా బాధ్యతలు స్వీకరించిన డైరెక్టర్లను విద్యుత్తు శాఖకు చెందిన వివిధ యూనియన్ నాయకులు, విద్యుత్తు ఉద్యోగులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.