హనుమకొండ సబర్బన్, జూన్ 26 : వ్యవసాయ సర్వీసుల మంజూరులో జాప్యం చేయొద్దని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు అధికారులకు సూచించారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో సోమవారం వరంగల్, మహబూబాబాద్ జిల్లాల ఎస్ఈలు, డీఈలు, ఎస్ఏవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దత్తత గ్రామాల విద్యుత్ పనులపై సమీక్షిస్తూ పారామీటర్ల ప్రకారం అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. కాలిపోయిన, పనిచేయని మీటర్లను మార్చాలని సూచించారు. నియంత్రికల వైఫల్యాలను తగ్గించాలని, రిపేర్లు ఆలస్యం కాకుండా చూడాలన్నారు.
సంవత్సరం పైబడిన డిస్కనెక్టెడ్ సర్వీసులను తనిఖీ చేయాలని ఆదేశించారు. సబ్స్టేషన్ల నిర్వహణను ఎప్పటికప్పుడు చేయాలని, లైన్ల పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. విధిగా హెడ్ క్వార్టర్లో ఉండాలని, ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు పెంచాలని సూచించారు. రోలింగ్ స్టాక్ ఉండేటట్లు చూసుకోవాలని, టీఎస్ఐపాస్, నాయీబ్రాహ్మణ, దోభీఘాట్, లాండ్రీ సర్వీసుల మంజూరు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బీ వెంకటేశ్వరరావు, పీ సంధ్యారాణి, పీ మోహన్‌రెడ్డి, వీ తిరుపతిరెడ్డి, సీజీఎంలు కిషన్, అశోక్ కుమార్, సదర్లాల్, భీకంసింగ్, జీఎంలు మదుసూధన్, నరేశ్, డీఈ ఐటీ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.