వరంగల్ చౌరస్తా, జనవరి 10 : రూ.75 కోట్లతో హైటెక్ హంగులతో వరంగల్ బస్‌స్టేషన్‌ను నిర్మిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కుడా ఆధ్వర్యంలో చేపట్టనున్న బిల్డింగ్ నమూనాను మంగళవారం కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ డాక్టర్ గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, రోడ్డు రవాణా సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త బస్‌స్టేషన్ వరంగల్‌కే ఐకాన్‌గా నిలువనుందన్నారు. నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారని, అందుకు అనుగుణంగానే ఆధునిక హంగులతో ఐదు అంతస్తులు, 32 ప్లాట్‌ఫాంలతో నూతన బస్‌స్టేషన్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైల్వేస్టేషన్‌కు ఎదురుగా 40ఏళ్ల క్రితమే బస్టాండ్ నిర్మించారని, నగరంలో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నూతన బస్‌స్టేషన్ నిర్మాణానికి నమూనాలు రూపొందించిన కుడా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. బస్టాండ్ చుట్టుపక్కల చిరు వ్యాపారులు చేసుకుంటున్న కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కుడా చైర్మన్ మాట్లాడుతూ.. వరంగల్‌కే తలమానికంగా నిలిచిపోయేలా బస్‌స్టేషన్ నిర్మిస్తామన్నారు. సుమారు రెండు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు. సింగపూర్, మలేషియా దేశాల్లోని బస్టాండ్ నమూనాలను తలదన్నే విధంగా భవన నిర్మాణం ఉండబోతున్నదని తెలిపారు. కలెక్టర్, గ్రేటర్ కమిషనర్ మాట్లాడుతూ.. నూతన బస్‌స్టేషన్ నిర్మించడానికి ముందుగానే ప్రస్తుత బస్టాండ్‌ను వేరే చోటకు తరలిస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత, డిప్యూటీ ఆర్ఎం కృపాకర్‌రెడ్డి, డీఎం సురేశ్ పాల్గొన్నారు.