భీమదేవరపల్లి, సెప్టెంబర్ 24: దేశంలోని సహకార సంఘాలను రూ. 450 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఎన్డీడీబీ ఎస్జీఎం డాక్టర్ శ్రీధర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మహిళా సహకార డెయిరీలో బుధవారం ఎన్డీడీబీ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సహకార సమృద్ధిపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. తొలుత ముల్కనూరు సహకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశీ విశ్వనాథరెడ్డి, ఎన్డీడీబీ వ్యవస్థాపక అధ్యక్షుడు వర్గీస్ కురియన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ ఒకప్పుడు గుజరాత్ వంటి రాష్ట్రంలోనే పాల వెలుగులు ఉండేవని, అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి కృషితో అన్ని రాష్ర్టాల్లో పాల ఉత్పత్తులు పెరిగాయని వివరించారు. పాల ఉత్పత్తులు పెంచేందుకు జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల ఆర్థిక పురోగతి, పాడి రైతులను బలోపేతం చేయడమే ఎన్డీడీబీ లక్ష్యమన్నారు. ఉత్పత్తి దారుల సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ఎన్డీడీబీ ఆయా రాష్ర్టాలకు వారి సామర్థ్యాలకు అనుకూలంగా నిధులు వెచ్చిస్తుందన్నారు.
ముల్కనూరు సహకార గ్రామీ ణ పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలం క్రితం వరకు విదేశాల నుంచి పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకునే వారిమని, నేడు మనమే పాల ఉత్పత్తులను బయటి దేశాలకు ఎగుమతి చేసే దశకు చేరుకోవడం గర్వకారణమన్నారు. సహకార విధానం ద్వారా పాడిపరిశ్రమలు అభివృద్ధి చెందితే తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ముల్కనూరు మహిళా సహకార డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, నెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు, మిల్క్‌ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ఎన్డీడీబీ సౌత్ ఇండియా ఇన్చార్జి రోమీజాకబ్, డీసీవో సంధ్యారాణి, డెయిరీ జీఎం గుర్రాల భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.