వరంగల్‌చౌరస్తా, డిసెంబర్ 28: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్తమ సేవలు అందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) వరంగల్ విభాగం జాతీయస్థాయి ప్రోత్సాహక అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌళిలో రెండు రోజులుగా నిర్వహించిన నాట్కాన్-2024 సమావేశాల్లో వరంగల్‌కు జాతీయస్థాయి అవార్డు వచ్చింది.
ఈ మేరకు శనివారం ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోకన్ చేతులమీదుగా డాక్టర్ అన్వర్‌మియా ఈ అవార్డు అందుకున్నారు. 2023లో నిర్వహించిన గ్రామీణస్థాయి సామాజిక సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, రికార్డుస్థాయి సభ్యత్వ నమోదుతోపాటు మేడారం జాతర సమయంలో భక్తులకు అందించిన వైద్య సేవలకు ఈ అవార్డు వచ్చిందని డాక్టర్ అన్వర్‌మియా తెలిపారు.
ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయచందర్రెడ్డితోపాటుగా నగరంలోని ప్రముఖ వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ గుండె వైద్యనిపుణుడు రామక శ్రీనివాస్‌కు జాతీయ అవార్డును డాక్టర్ అశోకన్ అందించారు. కార్డియో పల్మునరీ రీసక్సిటేషన్(సీపీఆర్)పై విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులతోపాటు సామాన్యులకు సైతం అవగాహన కల్పించడం, ప్రజలు గుండె సంబంధిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆయనకు ఈ అవార్డు అందించారు.