హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 15 : నేటి నుంచి 18వ తేదీ వరకు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ పోటీలు జరుగనుండగా, దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో బుధవారం జేఎన్ఎస్ సందడిగా మారింది. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు, 150 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొననున్నారు. వీరితోపాటు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 25 మంది, రాష్ట్రం నుంచి 70 మంది సాంకేతిక, 25 మంది స్థానిక అధికారులు, 50 మంది వలంటీర్లు హాజరుకానున్నారు.
చాంపియన్‌షిప్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీ కడియం కావ్య, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, స్నేహా శబరీష్, బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి పోటీలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్ తెలిపారు.