ఖిలావరంగల్, ఫిబ్రవరి 13 : బీసీలకు సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. బుధవారం శివనగర్‌లో బీఆర్ఎస్ బీసీ కులాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసంపై నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వం రీ సర్వే చేయడానికి సుముఖత చూపిస్తున్నదంటే మొదట చేసిన సర్వే వంద శాతం తప్పే అని అంగీకరించినట్లేనన్నారు. 2014లో నాటి సీఎం కేసీఆర్ కుటుంబ సర్వే చేయి స్తే బీసీలు 51 శాతం ఉన్నట్లు గణాంకాలు చెప్పాయని, పదేళ్ల తర్వాత 45.5 శాతం ఎట్లా తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ సర్కారు ఎన్నికలను వాయిదా వేసుకొని రీ సర్వే ప్రక్రియ మొ దలు పెట్టిందన్నారు. కుల గణనపై రీసర్వే చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, బీసీ సంఘాల నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించాలన్నారు. బీసీలకు నష్టం కలిగించే కుట్రలో భాగమే కులగణనలో జనాభాను తకవ చేసి చూపించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ బీసీలకు 50 శాతం ప్రకటించి అమలు చేశారని గుర్తు చేశారు. బీసీ కుల గణన సర్వే చిత్తు కాగితాలని మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న అలియాస్ చింతపండు నవీన్ వాటిని కాల్చారని గుర్తు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను కరపత్రాలుగా ముద్రించి ఆ పార్టీ కుటిల నీతిని ఎండగడుతామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కాంగెస్ బొందపెడుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. బీసీల కోసం పోరాటం చేస్తావా లేదా తలదించుకుంటావా.. అని మంత్రి సురేఖ ఆలోచించుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేశ్‌బాబు, మాజీ కార్పొరేటర్లు కుందారపు రాజేందర్, బయ్య స్వామి, దండు దయాసాగర్, రామ రాంబాబు, కొంతం మోహన్, నాయకులు మో డెం ప్రవీణ్, రాజ్‌కిషోర్, రాజబోయిన యాకయ్య, నామాని రాజ్‌కుమార్, వేల్పుగొండ యాకయ్య, బొజ్జ రాజ్‌కుమార్‌తోపాటు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.