ములుగుటౌన్, జూన్ 2 : కరోనా కష్టకాలంలో ఏఎన్ఏం, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. కరోనా వేళ ప్రజల ప్రాణాలు కా పాడడంలో వీరిది అత్యంత కీలకపాత్ర అన్నారు. పలు శాఖల సిబ్బందికి బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో సన్మానించారు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి కలెక్టర్ వడ్డించారు. అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీఎంహెచ్వో అప్పయ్య, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ జగదీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డివిజన్ పంచాయతీ అధికారి దేవరాజ్, సర్పంచ్ నిర్మల, ఉప సర్పంచ్ సుమలత పాల్గొన్నారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత..
ఐసీఐసీఐ బ్యాంకు భూపాలపల్లి బ్రాంచ్ వారు రూ. 1.50 లక్షల విలువైన రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్యకు బుధవారం కలెక్టరేట్లో విరాళంగా అందించారు. ములుగు, భూపాలపల్లి జిల్లాకు ఒక్కొక్కటి చొప్పున అందించామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు విరాళాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఐసీఐసీఐ బ్యాం కు ప్రతినిధులు సతీశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.