ఆసక్తి చూపుతున్న రైతాంగం
తక్కువ ఖర్చు.. ఎక్కువ దిగుబడి
కలుపు నివారణకు ఎంతో మేలు
నీటి వసతితో పుష్కలంగా పంట
ములుగు రూరల్, ఆగస్టు 29 : ములుగు మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు మల్చింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావడమే కాకుండా కలుపు తీసే అవసరం ఉండదు. అంతేగాక మట్టి కోతకు గురికాకుండా ఉండడంతో పాటు నేల ఉష్ణోగ్రత నియంత్రణ అలాగే.. నీరు, ఎరువులు, ఖర్చులు ఆదా అవుతాయి. ఫలితంగద అధిక దిగుబడులు సొంతమవుతాయి. ఇలా విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చేవరకూ పంటపై పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడే రైతులను ప్లాస్టిక్ మల్చింగ్ విధానం లాభాల వైపు తీసుకెళ్తున్నది. ప్రస్తుత సాగురంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మల్చింగ్ కోసం మొదట కొంత పెట్టుబడి అవసరమైనప్పటికీ రైతులకు ఉద్యాన శాఖ రాయితీ ఇవ్వనున్నది.
ఈ విధానంతో అనేక లాభాలు
ములుగు మండలంలోని జాకారం, మల్లంపల్లి, రామచంద్రాపురం, దేవగిరిపట్నం, కాసిందేవిపేట, పంచోత్కులపల్లి, రాయినిగూడెం, అబ్బాపూర్ గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో ఈ మల్చింగ్ విధానాన్ని రైతులు పాటిస్తున్నారు. ఎక్కువగా మిర్చి, బొప్పాయి, టమాట, పుచ్చ పంటలకు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. పారదర్శకమైన మల్చింగ్ షీట్లను చేలల్లో పరచడం వల్ల సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించి భూమిలో దాగి ఉండే క్రిమీకీటకాలు, తెగుళ్ల వ్యాప్తికి కారణమైన సూక్మజీవులు నశిస్తాయి. పూర్వం ఈ పద్ధతిని రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాళ్లు, మొదలైనవి వాడేవారు. కానీ ప్రస్తుతం నీటి లభ్యతను అదుపు చేసేందుకు రైతులు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు ఉన్న పంటలకు 30నుంచి 40శాతం వరకు నీరు ఆదా అవుతుంది. ఈ విధానాన్ని బిందు సేద్యం ద్వారా కలిపి వాడితే అదనంగా 20శాతం నీరు ఆదా అపడమే కాకుండా మొక్కలకు రెండు లేదా మూడు నీటి తడులు ఆదా అవుతుంది. కలుపు నివారణలో కూడా సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్క మీద పడకుండా మల్చింగ్ కప్పడం వల్ల కిరణ జన్యసంయోగ క్రియ జరుగుతుంది. దీంతో సుమారు 85శాతం వరకు కలుపు నివారణ జరుగుతుంది.
మొక్క చుట్టూ సూక్మ వాతవరణ పరిస్థితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో ఉండే సూక్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తుంది. మొక్కలను అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. ఈ ప్రక్రియను సాయిల్ సోలరైజేషన్ అంటారు. దీంతో పంటకు చీడ పురుగులు తాకకుండా మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడినిచ్చే అవకాశం ఉంది. ఎరువుల ఆదాలో భాగంగా మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయి. ఫలితంగా పంట ఏపుగా పెరిగి నాణ్యమైన, అధిక దిగుబడినిస్తుంది. ఈ పద్ధతిలో పంట సాగుచేయడం వల్ల సాధారణ దిగుబడి కన్నా 20 నుంచి 50శాతం ఎక్కువ పొందవచ్చు. నేల తయారీలో ఖర్చు ఆదా అవుతుంది. భూమిలో ఎల్లప్పుడూ తేమ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీంతో నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కకు అధికంగా అందుతాయి. అందుకే ఎక్కువ మంది రైతులు మల్చింగ్ విధానంలో పంటలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.