హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 2 : ఇటీవల జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా అసలేమైంది సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఆర్యన్ రమేశ్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని ఓ హోటల్లో ఆయన చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆర్యన్మాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్-2 ద్వారా చిత్రాన్ని తీస్తున్నామని, కొంతభాగం షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన సన్నివేశాలను వరంగల్‌లో చిత్రీకరించనున్నట్లు తెలిపారు.
చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్‌పై పాటను తీసినట్లు చెప్పారు. ఇందులో ఆదిత్య ఓం, సోనికాగౌడ్, ఆర్యన్ రమేశ్, ఈషా హిందోచా, అతిథి సింగ్ నటిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు, ముంబైకి చెందిన ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు చెప్పారు. చిత్రాన్ని ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు. వరంగల్ ప్రజలు సినిమాను ఆదరించాలని ఆయన కోరారు. చిత్రానికి దర్శకుడిగా అరుణ్‌కుమార్, సంగీత దర్శకుడిగా మహావీర్, డూప్‌గా రమేశ్‌రాజ్ వ్యవహరిస్తున్నారు.