నటుడిగానే కాక, పలు విభాగాల్లో బహుముఖ ప్రజ్ఞ కనపరచి, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్. సినిమాల్లోకి రాకముందే పవన్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్న సంగతి తెలిసిందే. హీరోగా మారాక తాను నటించిన పలు చిత్రాల్లోనూ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ప్రదర్శించి అభిమానుల్ని అలరించారు పవన్‌కల్యాణ్. తాజాగా మార్షల్ ఆర్ట్స్‌లోనే ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారాయన. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్స్’లో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా ఆయనకు ఈ అంతర్జాతీయ గౌరవం దక్కింది.
జపాన్ సాంప్రదాయ యుద్ధకళలకు సంబంధించిన ప్రతిష్టాత్మక ‘సోగు బుడో కన్రి కై’ సంస్థ.. మూడు దశాబ్దాలకు పైగా అంకితభావంతో మార్షల్ ఆర్ట్స్‌పై పవన్‌కల్యాణ్ చేసిన పరిశోధన, సాధన, సేవలను గుర్తించి ‘ఫిఫ్త్ డాన్'(ఐదవ డాన్) పురస్కారాన్ని అందించింది. అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే విశిష్ట బిరుదుతో పవన్‌ను సత్కరించింది.
ఈ మైలురాళ్ల ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రం.. ఈ మూడింటినీ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్‌కల్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.