బయ్యారం, మార్చి 27 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంత్రాలపోడు గ్రామానికి చెందిన ఓ తల్లి తన చనిపోయిన కొడుకు, అతడి ప్రేయసికి గుడి కట్టించి, ఏటా శ్రీరామనవమి రోజున ఆ అమర ప్రేమికులకు కల్యాణం జరిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే.. సంత్రాలపోడు గ్రామానికి చెందిన బానోత్ లాల్, సుక్కమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. కుమారుడు బానోత్ రాంకోటిని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడిని చేయాలనుకున్నారు.
ఈ క్రమంలో అతడు ఇంటర్ చదువుతుండగా ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెంది 2004లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మరణాన్ని తట్టుకోలేక ప్రేమించిన అమ్మాయి సైతం ఏడాది తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. కాగా, తనయుడి మరణాన్ని తట్టుకోలేక సుక్కమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు కలలో కనిపించిన రాంకోటి తనతోపాటు తన ప్రేయసి విగ్రహాలను ప్రతిష్ఠించి గుడికట్టి ఏటా శ్రీరామనవమి రోజున కల్యాణం జరిపించాలని కోరాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో రాంకోటి కోరిక మేరకు అతడు చనిపోయిన ఏడాది తర్వాత ఇంటి ఆవరణలో గుడి కట్టించిన తల్లి సుక్కమ్మ తనువు చాలించిన అమర ప్రేమికులకు 21 ఏండ్లుగా శ్రీరామ నవమి రోజు పెళ్లి తంతు నిర్వహిస్తున్నది. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా రాంకోటితోపాటు అతడు ప్రేమించిన అమ్మాయి విగ్రహాలకు నూతన వస్ర్తాలు ధరింపజేసి మేళతాళాలతో పురోహితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ పెళ్లి వేడుక నిర్వహిచారు. తనయుడు కానరాని లోకాలకు వెళ్లినా ఏటా వివాహ వేడుకలు నిర్వహిస్తున్న కన్నతల్లి ప్రేమను స్థానికులు కొనియాడారు.