మహబూబాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదని, ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా విజయోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు.
నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కాదు.. తెలంగాణ ప్రజలే సంబురాలు చేసుకునే వాళ్లు కదా? అని ప్రశ్నించారు. ఒకవైపు విజయోత్సవాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూనే, మరోవైపు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హరీశ్‌రావు ఫోన్‌ట్యాపింగ్ చేశాడని ఒక రౌడీషీటర్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు, మీ ప్రభుత్వ హయాంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడానికి వెళ్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యేలపై కేసులు పెడితే ఎఫ్ఐఆర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు.
సీఎం కోసం నిర్మించిన ఇంట్లో ఉండకుండా తన సొంత ఇంటిని ఇనుపకంచెలతో నిర్మించుకున్న రేవంత్‌రెడ్డికి ప్రజలన్నా, రాష్ట్రమన్నా చులకనభావమని, గౌరవం లేదని విమర్శించారు. సంవత్సర కాలంలో చేసిన పనులేవని నిలదీస్తే తమపై దాడులు చేయడం సరికాదన్నారు. లగచర్లలో దళిత, గిరిజన రైతులపై దాడులు చేసి, భూములు గుంజుకోవాలని చూస్తే అధికారులు, పోలీసులను ఎలా నిర్బంధించారో, రానున్న రోజుల్లో మీరిచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలు మిమ్మల్ని వాడవాడలా నిర్బంధించడం ఖాయమన్నారు.
తెలంగాణ పవిత్రతను కొల్లగొడుతూ, రాష్ట్ర ప్రగతిని నాశనం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో రాష్ర్టాన్ని పెట్టడానికి రైఫిల్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. రైఫిల్‌రెడ్డి 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రూ.40వేల కోట్ల రుణమాఫీకి రూ. 12 వేల కోట్లు మాత్రమే చేసి, చేతులు దులుపుకున్న రేవంత్‌రెడ్డి ఏ గ్రామానికైనా పోయి, రైతులతో మాట్లాడే దమ్ముందా అని సవాల్ విసిరారు.
ఆరు గ్యారెంటీల్లో ఏ ఒకటీసరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఉచిత బస్సు పెట్టి బస్సుల సంఖ్య కుదించావు.. సిలిండర్ సబ్సిడీ ఇవ్వడం లేదు.. వడ్లకు బోనస్ అని బోగస్ మాటలు చెప్పావు.. రైతులకు రుణమాఫీ చేయక, రైతుబంధు, బోనస్ ఇవ్వకుండా మోసం చేసిన నీకు త్వరలోనే తెలంగాణ ప్రజలు ఘోరికట్టడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలపై కుట్రలు ఆపకుంటే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ఎడ్ల వేణు, బానోత్ రవికుమార్, జెరిపోతుల వెంకన్న, మంగళంపల్లి కన్నా, తేళ్ల శీను, రామకృష్ణ, అర్జున్‌ప్రసాద్ పాల్గొన్నారు.