కురవి, నవంబర్ 30 : ‘పరిసరాలు ఇలాగేనా ఉండేది? ముళ్ల చెట్లు పెరిగినా.. మురుగు నీరు నిల్వ ఉన్నా పట్టించుకోరా? వంట గదులు ఇట్లనే ఉంటయా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా? డైనింగ్ హాల్లోనే వ్యర్థాలు పడేస్తే వాసనకు పిల్లలు ఎలా తింటారు? వారి ఆరోగ్యం బాగుంటుందా?’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్)ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాలు, డైనింగ్ హాల్‌ను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
డైనింగ్ హాల్లో రెండు రోజులుగా వ్యర్థాలను తొలగించక దుర్వాసన వస్తుండడాన్ని గుర్తించి సిబ్బందిపై మండిపడ్డారు. ప్రిన్సిపాల్ ప్రదీప్కర్థంను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విద్యార్థులను కనీసం మనుషులుగా చూడకపోతే ఎలా? డైనింగ్ హాల్ ఇలా ఉంటే విద్యార్థులు భోజనమెలా చేస్తారు? వారి ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా?’ అంటూ ప్రశ్నించారు. బియ్యం, కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, పాలు సమయానికి రావడం లేదని, ఉప్మా ఉండలుగా, రాగి జావా నీళ్లలాగా ఉందని, మీ పిల్లలకు ఇలాగే పెడతారా అని అడిగారు. డైనింగ్ హాల్ నుంచే ఆర్సీవోకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు ఫోన్లో గురుకులం సమస్యలను తెలిపారు.
టాయిలెట్స్ సరిగా పనిచేయడం లేదని, పైపులు లీకేజ్ అవుతున్నాయని, 500 మందికిపైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్కర్స్ సరిగా రావడంలేదని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఈ ప్రాంతం వారు కాదని, రాష్ట్రం మొత్తం ఫుడ్‌పాయిజన్‌తో అల్లాడుతుందని, పట్టించుకోకపోతే అన్ని గురుకులాలు అలాగే తయారవుతాయన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రూ. 6 కోట్ల నిధులు కేటాయించానన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్‌తో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ ‘మేమున్నాం.. అధైర్యపడొద్దు’ అంటూ భరోసానిచ్చారు. ఇక్కడి సమస్యలు కలెక్టర్‌కు చెప్పానని, గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సత్యవతి హామీ ఇచ్చారు.
‘జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలను ఓ తల్లిగా కోరుతున్నా.. బంగారు భవిష్యత్ ఉన్న చదువుకునే పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు.. వారి సమస్యలు పట్టించుకొని పరిష్కరించండి’ అంటూ సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు. చిన్న పిల్లలు చనిపోతుంటే మహిళా మంత్రులు రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని, ఓ వైపు హైకోర్టు మొట్టికాయలు వేసినా కొండా సురేఖ తీరు మారడం లేదని మండిపడ్డారు. మంత్రులుగా కాకపోయినా, కనీసం మహిళలుగా మాట్లాడాలని హితవు పలికారు. కురవి మండల కేంద్రంలోని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లగచర్లలో భూ సేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం గిరిజన రైతుల విజయమని, మానుకోటలో నిర్వహించిన మహాధర్నా కీలకంగా మారిందన్నారు.
సర్వసతి నిలయాలుగా ఉన్న గురుకులాలు ప్రస్తుతం పర్యవేక్షణ లేక పడావుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ జరగడంలో గురుకులాల సెక్రటరీగా గతంలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రమేయం ఉందని సురేఖ అనడం విడ్డూరంగా ఉందన్నారు. నిరాధార ఆరోపణలు మాని బుద్ధిగా పని చేసుకోవాలని హితవు పలికారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇంటి నుంచి తినుభండారాలు తెచ్చుకొనే విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని ఒక మంత్రి మాట్లాడితే, మరో మంత్రి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రి సీతక్క ఒక్క పాఠశాలనైనా తనిఖీ చేశారా? అంటూ ప్రశ్నించారు. అసమర్ధ కాంగ్రెస్ పాలనలో అమాయక విద్యార్థులు బలవుతున్నారన్నారు. కురవి గురుకులం సమస్యలు వివరిద్దామని ఆర్సీవోకు ఫోన్ చేస్తే కనీస స్పందన లేదన్నారు. ఏడాది గడుస్తున్నా కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ జపమే చేస్తున్నారని, వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని సత్యవతి విమర్శించారు. సమావేశంలో నాయకులు నరహరిగౌడ్, బాదె నాగయ్య, బోడ శ్రీను, నెహ్రూనాయక్, అల్లూరి కిషోర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.