డోర్నకల్, సెప్టెంబర్ 23 : ఇటీవల వచ్చిన వరదలకు మహబూబాబాద్ జిల్లాలో రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. వరద బాధితులు, రైతులకు రూ. 10 వేల చొప్పున ఇస్తామన్న పరిహారాన్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. సోమవారం డోర్నకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు మాన్యు పాట్ని నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయలేదని, షరతులతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో 36 లక్షల మంది రైతులకు కేసీఆర్ రూ. లక్ష వరకు విడతల వారీగా రుణమాఫీ చేశారని తెలిపారు. అన్నదాతలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని, రైతులు, కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా సెప్టెంబర్ మాసం గడుస్తున్నప్పటికీ అందించలేదని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెపితే, సీఎం మరొకటి చెపుతున్నాడని అన్నారు.
ముదిరాజ్‌లకు కూడా ఇంతవరకు చేపపిల్లలు అందించలేదని, గ్రామాల్లో వరదలకు తెగిపోయిన చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసే దిక్కులేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సరైన అవగాహన లేదని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు, మేధావులు, విద్యావంతులు, ఆలోచన చేయాలని సత్యవతి రాథోడ్ సూచించారు.
డోర్నకల్ సీఎస్ఐ చర్చి మాజీ కోశాధికారి ములక ఎడ్విన్రావు (94) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న సత్యవతి రాథోడ్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృ తుడు ఎడ్విన్రావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆమె వెంట మాజీ జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, వార్డు కౌన్సిలర్లు బోరగల్ల శరత్‌బాబు, కొండేటి హేమచంద్ర శేఖర్, వీరన్న, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు మారబోయిన రాంభద్రం, బీఆర్ఎస్ నాయకులు మాన్యు పాట్ని, కొత్త వీరన్న, సూర మధు, కందుల మధు, గౌస్, రేపాకుల కృష్ణ తదితరులున్నారు.