మహబూబాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మండలిలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారన్నారు. బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్ చేస్తూ అక్కడి నుంచి వయా వట్టేరు వాగు ద్వారా పాలేరుకు వెళ్లేలా అంచనా వేశారని, అయితే నియోజకవర్గంలో రిజర్వు ఫారెస్ట్ అత్యధికంగా ఉన్నందున ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు చేసి, డోర్నకల్ పాలేరుకు లింక్ చేశారన్నారు.
ఇలా చేయడం వల్ల ఇల్లందు, ఖమ్మం రూరల్ మండలానికి నీళ్లు అందుతాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీపీఆర్ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఈ డిజైన్‌ను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని, దీంతో నియోజకవర్గంలో సగం ప్రాంతానికే నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. రోళ్లపాడు నుంచి లిఫ్ట్ పెట్టి బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్ చేసి, బయ్యారం, ఇల్లందు మండలాలకు సాగునీరు అందించాలని, మిగిలితే పాలేరు లింక్ కెనాల్‌కు తరలించాలని కోరారు. ఈ ప్రాజెక్టు డోర్నకల్ మండలం మీదుగా వెళ్తున్నా అక్కడి రైతులు నీటిని వినియోగించుకొనే పరిస్థితి లేదని, నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.