స్టేషన్ ఘన్పూర్, జనవరి 24 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్‌లో చేరాడని విమర్శించారు. శనివారం మున్సిపల్ పరిధిలోని శివునిపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి కాపాడుకునేందుకు తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కడియం అడుగుతారని ఆయన ప్రశ్నించారు. కడియం అంటే కమిట్మెంట్ కాదని, కడియం అంటే ఆత్మవంచన అని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉంటాయన్నారు. కడియం చేసిన మోసానికి బుద్ధి చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయంసాధించాలన్నారు. మున్సిపల్ కార్యాలయంపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తే మున్సిపల్ పరిదిలోని ప్రతి వార్డులోని 200 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి కుట్టుమిషన్లు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కడియం అంటే కమిట్మెంట్ కాదు : ఎమ్మెల్యే పల్లా
కడియం శ్రీహరి అంటే అభివృద్ధి, కమిట్మెంట్ కాదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు వంద పడకల దవాఖాన, డిగ్రీ కళాశాల, ఇతర అభివృద్ధి పనులు రాకుండా అడ్డుకున్న చరిత్ర కడియంకు ఉందన్నారు. నాటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి వద్దకు వెళ్లి మున్సిపాలిటీ రాకుండా చూశాడని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటు వేయాలా, ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకుండానే ప్రజా సమస్యలు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని పల్లా కోరారు..
దేవాదుల సృష్టికర్త కడియం అని చెప్పుకోవడంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్ట్‌కు చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయగా, 2002 నుంచి 2004 వరకు ఎలాంటి పని జరగకపోవడంతో పిండాలు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజయ్య హయాంలో ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజ్ తప్ప మరో అభివృద్ధి లేదన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కడియంకు గుణపాఠం చెప్పారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాగే ఫలితాలుంటాయని పల్లా వివరించారు.
మోసానికి మారు పేరు కడియం
గెలిపించిన కార్యకర్తలను, ఓటు వేసిన ప్రజలను కడియం శ్రీహరి మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తుపాకి రాముడిని తలపించేలా రేవంత్‌రెడ్డి మాటలున్నాయని విమర్శించారు. కేసీఆర్ ఆమలు చేసిన పథకాలే తప్ప రేవంత్‌రెడ్డి కొత్త పథకాలు తీసుకొచ్చినవి ఏమీ లేవన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టి, పురుషుల చార్జీలను డబుల్ చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. బూత్‌ల వారీగా మహిళలకు అందిస్తున్న రూ.300 విలువైన ఇందిరమ్మ చీరలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1200 చొప్పున అప్పు చేస్తున్నదన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు మోసాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని హెచ్చరించారు. త్వరలో జరిగే మున్సిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
కడియంకు రాజకీయ సమాధి తప్పదు
– మాజీ ఎమ్మెల్యే రాజయ్య
పదవులు, కుటుంబ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు రాజకీయ సమాధి చేస్తాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. రైతుభరోసా, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కారు ఫెయిలందైన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రులుగా ఉన్నప్పుడు వారి సహకారంతోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కేసీఆర్‌తోనే స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.