వరంగల్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఆడబిడ్డలకు మంత్రులుగా అవకాశం దక్కగా వారికి శనివారం శాఖలను కేటాయించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్కకు కీలకమైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖలు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖకు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖలను కేటాయిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో శనివారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఈనెల 14న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరు మహిళలకు ముఖ్యమైన శాఖలు దక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి మంత్రి అయిన ధనసరి అనసూయ(సీతక్క)కు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు. తొలిసారి మంత్రి పదవి దక్కిన సీతక్కకు శాఖల పరంగానూ, సంఖ్య పరంగానూ ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరిగింది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు పర్యావరణం, అడవులు, దేవాదాయ శాఖలను కేటాయించారు. 2009 ఎన్నికల అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ తొలిసారి మంత్రి అయ్యారు. అప్పుడు మహిళా, శిశు సంక్షేమ శాఖల బాధ్యతలను నిర్వహించారు. ఏడాదిలోనే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు రెండోసారి మంత్రి పదవి పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగంగా ఉన్న మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కీలకమైన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, అసెంబ్లీ వ్యవహారాల శాఖలను కేటాయించారు. హనుమకొండ జిల్లాలో భాగంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్‌కు రవాణా, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖలను కేటాయించారు.
ఎమ్మెల్యేల ప్రమాణం
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ వీరితో ప్రమాణం చేయించారు. సీతక్క(ములుగు), కొండా సురేఖ(వరంగల్ తూర్పు), రేవూరి ప్రకాశ్‌రెడ్డి(పరకాల), దొంతి మాధవరెడ్డి(నర్సంపేట), గండ్ర సత్యనారాయణరావు(భూపాలపల్లి), నాయిని రాజేందర్‌రెడ్డి(వరంగల్ పశ్చిమ), జాటోత్ రామచంద్రునాయక్(డోర్నకల్), భూక్య మురళీనాయక్(మహబూబాబాద్), మామిడాల యశస్విని(పాలకుర్తి), కె.ఆర్.నాగరాజు(వర్ధన్నపేట), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(మంథని), పొన్నం ప్రభాకర్(హుస్నాబాద్), కోరం కనుకయ్య(ఇల్లెందు), తెల్లం వెంకట్రావు(భద్రాచలం) ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు. కాగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఈనెల 14న అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఓరుగల్లుకు తొలిసారి అటవీశాఖ
తాజా మంత్రివర్గంలో స్థానం పొందిన కొండా సురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖలు కేటాయించగా ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఓ మంత్రికి అటవీశాఖ దక్కడం ఇదే తొలిసారి. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి అటవీశాఖ మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో కొండా సురేఖ అటవీశాఖ పొందారు.