జనగామ, మే 16 (నమస్తే తెలంగాణ) : ‘అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. పంచాయతీ సెక్రటరీలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఏఈవోలు, టీచర్లు, ఇంజినీర్లను నియమించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. 1.70 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. రేవంత్ ఇచ్చిన 30 వేలు కూడా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో భర్తీ చేసినవే’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డితో కలిసి జనగామలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పట్టభద్రుల సన్నాహాక సమావేశం పార్టీ సీనియర్ నాయకుడు గద్దల నర్సింగరావు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తామని, 50 వేల మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి 10 వేలకు నోటిఫికేషన్ ఇచ్చి మభ్యపెట్టిందని అన్నారు. చానల్ పేరుతో బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడుతున్న తీన్మార్ మల్లన్న తెలంగాణకు నయా నయీం లా తయారయ్యాడని విమర్శించారు. తన భార్య నీలిమ ట్రాన్స్‌కోలో డీఈఈగా పనిచేస్తుంటే కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేశాడన్నారు. తన సంస్థల మీద ఇంటెలిజెన్స్, పోలీసులతో ఫిర్యాదు లు చేయించాడని, వాళ్ల తమ్ముడిని పంపి రూ.2 కోట్లు అడిగాడని, ఒక రూపాయి కూడా ఇవ్వనని చెప్పానని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీలో చదివిన ఉన్నత విద్యావంతుడు రాకేశ్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ‘చార్ సౌ బీస్’ గాడిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టింది.
అందుకే విద్యావంతులు, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అధికార పార్టీకి జీహుజూర్ అనే తీన్మార్ మల్లన్న కావాలో.. నిరుద్యోగుల గొంతుకగా ప్రశ్నించే రాకేశ్‌రెడ్డి కావాలో విజ్ఞతతో ఆలోచించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. మోసకారులు, బ్లాక్మెయిలర్లను దూరం పెట్టి విద్యా వంతులకు పట్టగట్టే పరంపర మళ్లీ కొనసాగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై నాలుగు సార్లు గులాబీ జెండా ఎగరేశామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు భాగ్యలక్ష్మి, పోకల జమున, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు ఎడవెల్లి కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.
తన ఎదుగుదల చూసి ఓర్వలేక బీజేపీ రాజకీయంగా హత్య చేసింది. కొనఊపిరితో ఉన్న తనను కేసీఆర్, కేటీఆర్, పల్లా చేరదీసి బీఆర్ఎస్ పార్టీలో మంచి అవకాశం ఇచ్చారు. తాను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి కానుకగా ఇస్తా. రూ. 4వేల నిరుద్యోగ భృతి, 50 వేల మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ప్రకటన ఊసేలేదని, ఏరికోరి ఎన్నుకుంటే నిరుద్యోగులను కాంగ్రెస్ నిండా మోసం చేసింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినా వచ్చే నష్టం లేదని..ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడా? లేదా ప్రశంసించేవాడు కావాలో ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఒకసారైనా ప్రశ్నించాడా? కాంగ్రెస్ అభ్యర్థిని రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతా అని ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన వాడిని ఓటు ఆయుధంతో దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు.
– ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి