వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 20: ప్రజలు మెచ్చుకునేలా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. వరంగల్ 36వ డివిజన్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ ఆధ్వర్యంలో జ్యోతిబసునగర్ కాలనీ అధ్యక్షుడు గడల రమేశ్ నివాసంలో పేదల ఇండ్ల పట్టాల కోసం ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మురికివాడలు లేని నగరంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని పేదలను ఎవరూ పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. పేదలందరికీ పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టారన్నారు. త్వరలోనే తూర్పు నియోజకవర్గం మొత్తం గుడిసె కాలనీలతోపాటు చింతల్ ప్రాంతవాసులకు సొంటింటి కల నెరవేరనుందన్నారు. జీవో 58, 59 విడుదల చేసిన తర్వాత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయించి తాగునీటి కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య, మర్రి శ్రీనివాస్, రమేశ్, శ్యామ్, నరేశ్, ఐలయ్య, రమ, శ్రీను, మోహన్, లావణ్య పాల్గొన్నారు.
కాశీబుగ్గ: ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే నరేందర్ పిలుపునిచ్చారు. 20వ డివిజన్ కాశీబుగ్గలోని అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్(3) ద్వారా కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సచివాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూటి దయాకర్, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ప్రవీణ్, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
కరీమాబాద్/పోచమ్మమైదాన్: విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఐఐటీలో బంగారు పతకాలు సాధించిన 32వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోటలోని వాణి విద్యానికేతన్ విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లం పద్మ, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, నాయకులు ఎం సుధాకర్, మోడెం ప్రవీణ్, బత్తిని రంజిత్, కస్తూరి వంశీ, కొండా రాజు పాల్గొన్నారు. అలాగే, 21వ డివిజన్ ఎల్బీనగర్లోని పలు ప్రాంతాల్లో రూ. 3.30 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే నరేందర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎండీ పుర్ఖాన్, సురేష్కుమార్ జోషి, నాయకులు పాల్గొన్నారు.