నర్సంపేట, అక్టోబర్ 26: విద్యార్థులు బంగారు భవిష్యత్‌కు ఇప్పటి నుంచే మార్గాలు వేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. నర్సంపేటలోని డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు వేదికగా మారనున్నాయని దొంతి అన్నారు. ప్రస్తుతం కళాశాలలో రూ. 20 లక్షలతో తరగతి గదులు నిర్మించనున్నట్లు చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 20 నుంచి 25 కంప్యూటర్లను మంజూరు చేశామన్నారు. అనంతరం డిగ్రీ సెకండియర్ విద్యార్థులు రచించిన ఆంగ్ల పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అలాగే, వరంగల్ కిట్స్ కళాశాలలో ఆన్లైన్ క్విజ్ పోటీల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మల్లం నవీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు వేముల సాంబయ్య గౌడ్, రాజేందర్, అంజలి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి బాలోత్సవం వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో గీతాంజలి విద్యా సంస్థల ఆధ్వర్యంలో శివాని గురుకులంలో నవంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న ఓరుగల్లు బాలోత్సవం-2024 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ వేములపెల్లి సుబ్బారావు, డైరెక్టర్లు గిరగాని రాహుల్‌వర్మ, శ్రీరాంకిరణ్, ప్రిన్సిపాల్ గూడూరు ప్రవీణ్‌కుమార్, రచయిత నెల్లుట్ల సుమన్, తోకల శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డి, పాల్వాయి రవి పాల్గొన్నారు.