గూడూరు మే 2: తప్పిపోయిన బాలుడు చెరువులో శవమై తేలిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం భూపతిపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చిన్నా ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధి లక్ష్మణ్ తండ కు చెందిన వాంకుడోత్ సునీత-కృష్ణమూర్తి దంపతుల ద్వితీయ కుమారుడు జాన్ పాల్ (6) అనే బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కనే ఉన్న సీతానగరం గ్రామపంచాయతీ పరిధి ఆదివారంపేట తండాకు శుభకార్యానికి రెండు రోజుల క్రితం వెళ్లాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి తన తండ్రితో కలిసి ఆటోలో ఇంటికి వస్తూ ఉన్న క్రమంలో గ్రామ సమీపంలో ఓ కల్వర్టు వద్ద కృష్ణమూర్తికి నిద్ర రావడంతో ఆటో ఆపి ఆటోలోనే తన కుమారుడితో నిద్రించాడు. తిరిగి గురువారం ఉదయం కృష్ణమూర్తి లేచి చూసేసరికి ఆటోలో జాన్పాల్ కల్పించలేదు.
దీంతో కంగారుపడిన కృష్ణమూర్తి గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెరువులో శవమై తేలిన బాలుడు
కాగా, తప్పిపోయిన బాలుడు శుక్రవారం ఉదయం భూపతిపేట గ్రామంలోని రాళ్లచెరువులో శవమై తేలాడు. బాలుడు ఆటోలో నుంచి కనిపించకుండా పోయిన ప్రదేశానికి కేవలం కొద్ది దూరంలోనే ఉన్న చెరువులో బాలుడు శవమైతేలాడు. బాలుడి శవాన్ని చూసినా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి బాలుడి మృతదేహాన్ని బయటకి తీసుకువచ్చారు. అయితే బాలుడి శరీరంపై కొన్ని గాయాలు ఉన్నట్లు సమాచారం. బాలుడిని ఎవరైనా కొట్టి చెరువులో పడవేశారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.