తాడ్వాయి, సెప్టెంబర్ 15 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల అభివృద్ధి అమ్మవార్ల పూజారుల అభిప్రాయాల మేరకే చేపడుతున్నామని, దీనిలో ఎవరి బలవంతం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలోని తల్లుల గద్దెల ప్రాంగణంలో సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, అమ్మవార్ల పూజారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎవరి బలవంతం లేకుండా ఆదివాసీల గొట్టు, గోత్రాలు, ఆచార వ్యవహారాల ప్రకారం అమ్మవార్ల గద్దెలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో తయారుచేసిన నమూనాపై పూజారుల అభిప్రాయాలు తీసుకున్నామని, వారు అభ్యంతరం చెప్పడంతో తిరిగి ఆర్కిటెక్టర్తో మరో డిజైన్‌ను చేయించామని, వారం రోజుల్లో ప్రొజెక్టర్ ద్వారా పూజారులకు వివరించిన అనంతరం విడుదల చేస్తామన్నారు.
పూజారుల అంగీకారం లేకుండా గద్దెల వద్ద ఎలాంటి పనులు చేయబోమని సీతక్క చెప్పారు. కాగా, మేడారం గద్దెల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మంత్రిని కోరారు. తమ సమ్మతితోనే ప్రభుత్వం గద్దెల అభివృద్ధిపై ముందుకు సాగుతుందని, ఎలాంటి బలవంతం లేదని తెలిపారు.