ములుగు, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : మినీ మేడారం జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి సీతక్కను భక్తులు గద్దెల ప్రాంగణంలో నిలదీశారు. గురువారం మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణం రద్దీగా మారింది. ఈ సమయంలో మంత్రి సీతక్క తల్లుల దర్శనం నిమిత్తం రాగా, పోలీసులు భక్తులను నిలిపివేశారు. ఈ సమయంలో తల్లుల సన్నిధికి చేరుకొని అమ్మవార్లను దర్శించుకొని వెళ్తున్న సీతక్కపై అక్కడే వేచి చూస్తున్న మహిళా భక్తులు మండిపడ్డారు. ‘నువ్వు మంత్రివైతే ఏంది.. నువ్వు దర్శనం చేసుకునేందుకు మమ్ములను ఎంత సేపు ఆపుతారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి తాను ఇప్పుడే వచ్చానని, దర్శనం చేసుకొని వెళ్తున్నానన్నారు.
డబ్బులిచ్చాకే పనులు చేపట్టాలి
శాయంపేట ఫిబ్రవరి 13 : విజయవాడ-నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు మండలంలోని గట్లకానిపర్తి శివారులో నేషనల్ హైవే అధికారులు, సంబంధిత మెగా కంపెనీ ప్రతినిధులు గురువారం మారింగ్ చేశారు. అయితే తమకు రేటు ఫిక్స్ చేయకుండానే మారింగ్ చేయడంపై భూములు కోల్పోతున్న రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధర నిర్ణయించి డబ్బులు ఇచ్చాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే మండలంలోని గట్లకానిపర్తి శివారు నుంచి వెళ్తుండగా, సుమారు 34 ఎకరాల భూమిని 85 మంది రైతులు కోల్పోతున్నారు. రైతులు నిరసన వ్యక్తం చేయడంతో వారికి పోలీసులు నచ్చజెప్పారు. హద్దులు మాత్రమే పెడుతున్నారని, పనులు చేపట్టడం లేదన్నారు.
నిర్బంధించి.. సర్వే చేసి
మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 13 : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సలార్ తండాలో గురువారం తెల్లవారుజామున తండావాసులను పోలీసులు నిర్బంధంలో ఉంచి, అధికారులు జాతీయ రహదారి (930పీ) కోసం భూములను సర్వే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ సర్వేను కొనసాగించారు. అనేక ఏళ్లుగా ఈ భూములను నమ్ముకొని జీవిస్తున్నామని, చావనైనా చస్తాం.. కానీ, జాతీయ రహదారికి తమ భూములను ఇచ్చేది లేదని తండావాసులు భూక్యా అనుసూర్య, కల్యాణి, హచ్చి పేర్కొన్నారు.
పచ్చని పంట పొలాలతో పాటు తాము నివాసముంటే ఇండ్ల మధ్య నుంచి వలికొండ టు భద్రాచలం జాతీయ రహదారిని వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యా పారులు, కొందరు పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల కోసం డిజైన్‌ను మార్చి కొత్త అలైన్మెంట్తో సర్వే చేస్తున్నారని, తమ పంట భూములను జాతీయ రహదారికి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అనేక సార్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సుమారు 140 మంది ఇండ్లు, పచ్చని పంట పొలాలకు తీవ్ర నష్టం జరుగుతుందని సర్వేను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తండావాసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిని కురవి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.