హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1: కాకతీయ యూనివర్సిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెత్తనం చెలాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన అనుచరుడికి చెందిన కొత్తగూడెం ఏజెన్సీకి సెక్యూరిటీ సర్వీసెస్‌ను అప్పనంగా అప్పగించడం, ఉన్నవారిని తొలగించడంపై సిబ్బంది మండిపడుతున్నారు. ఇన్నేళ్లు ఒకే ఏజెన్సీకి ఎలాంటి టెండర్లు, నోటిఫికేషన్లు ఇవ్వకుండా వర్సిటీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ ఆదేశాల మేరకు నూతన సెక్యూరిటీ ఏజెన్సీకి అందజేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాకతీయ యూనివర్సిటీలో సెక్యూరిటీ సర్వీసెస్ కోసం దేశవ్యాప్తంగా ఈప్రొక్యూర్‌మెంట్ ద్వారా అతితక్కువగా బిడ్ చేసిన కొత్తగూడెం పాల్వంచకు చెందిన ఐడీఎస్ఎస్ ఏజెన్సీకి అప్పగించినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇందులో 133 సెక్యూరిటీ గార్డ్లు, ఆరుగురు సెక్యూరిటీ సూపర్వైజర్లు ఉన్నారు. మొదటి సారిగా మహిళా సెక్యూరిటీలను కూడా నియమించారు. ఆగస్టు 1 నుంచి వీరు విధుల్లో చేరాల్సి ఉండగా మొదటి రోజు 40 మంది వచ్చారు. సిబ్బందిని సైతం సెక్యూరిటీ ఏజెన్సీ ఖమ్మం వారిని నియమించినట్లు సమాచారం. దేశంలో ఎన్నో సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇలాకాకు చెందిన వారికే రావడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.