రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ప్రగతి జాతర కొనసాగింది. సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్ రూం క్వార్టర్లు, పేదలకు రెండు పడక గదుల ఇండ్లతో పాటు మున్సిపాలిటీ పరిధిలో బృహత్తర మంచినీటి సరఫరా పథకం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల భవనం, దివ్యాంగుల సమావేశ మందిరం, వీధి వ్యాపారుల సముదాయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మినీ స్టేడియం, జిల్లా గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి రామన్నకు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ జయశంకర్ జిల్లాపై వరాల వాన కురిపించారు.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ)/భూపాలపల్లిటౌన్/ కృష్ణకాలనీ/ పలిమెల/ మహదేవపూర్/ టేకుమట్ల/గణపురం/ పలిమెల : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి రూ.275.95 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ముందుగా గణపురం మండల కేంద్రంలో రూ. 1.20 కోట్లతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని, అనంతరం గాంధీనగర్‌లో రూ.4కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతి బాఫూలే బీసీ వేల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో విద్యార్థులకు అధునాతన వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు విద్యార్థులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ విద్యార్థులతో రామన్న మాట్లాడుతూ ‘సౌకర్యాలు కల్పించడం మా వంతు, ఉన్నత శిఖరాలకు చేరడం మీ వంతు.. మంచిగా చదువుకోవాలి’ అని సూచించారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలో సింగరేణి సంస్థ కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం క్వార్టర్ల సముదాయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అంతకుముందు సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి, రక్షణ, సంక్షేమం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అందరూ ఆసక్తిగా తిలకించారు.
పలు అంశాలపై మంత్రి కేటీఆర్ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేశాలపల్లి వద్ద పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ఇక్కడ రూములను పరిశీలించి మహిళలతో మాట్లాడారు. అర్హులందరికీ ఇండ్లు వస్తాయని, త్వరలోనే ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందిస్తారని చెప్పారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో రూ.6.80 కోట్లతో ఏర్పాటు చేసి బృహత్తర మంచినీటి సరఫరా పథకాన్ని, రూ.23లక్షలతో నిర్మించిన దివ్యాంగుల సమావేశ మందిరాన్ని, సుభాష్ కాలనీలో వీధివ్యాపారుల సముదాయాన్ని ప్రారంభించారు. సుభాష్ కాలనీలో మినీ స్టేడియం, జిల్లా గ్రంథాలయం పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
నిధుల వరద.. వరాల జల్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్లే భూపాలపల్లి జిల్లా అయ్యిందని, సీఎం కేసీఆర్ ఈ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేశారు. భూపాలపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.135 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు కాపీని ఎమ్మెల్యే గండ్రకు అందజేశారు. పట్టణంలో అభివృద్ధి పనుల కోసం మరో రూ.50 కోట్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
మంత్రి కేటీఆర్ సూచన మేరకు భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అదనంగా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. జిల్లాలో 7,174 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.303 కోట్ల బ్యాంకు రుణాల చెక్కును అందజేశారు. భీంఘన్‌పూర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గండ్ర కోరిన రూ.30కోట్ల నిధులపై సీఎం కేసీఆర్‌కు వివరించి వచ్చేలా ప్రయత్నిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సింగరేణిలో డిస్మిస్డ్ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. భూపాలపల్లిలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.
చలివాగు లైనింగ్ పనులకు రూ.10కోట్లు మంజూరు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటైన గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో కార్యాలయాల ఏర్పాటుకు మంత్రి దయాకర్‌రావు చొరవ చూపాలన్నారు. గిద్దెముత్తారం, కాల్వపల్లి గ్రామాలను టేకుమట్ల మండలంలో కలుపుతామని హామీ ఇచ్చారు. చిట్యాలలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సుభాష్‌కాలనీ, కృష్ణకాలనీలో సింగరేణి కార్మికుల 1632 ప్లాట్లకు పట్టాలిచ్చేందుకు రంగం సిద్ధం చేసి మొదట 50 మందికి పట్టాలు అందించారు.
వేశాలపల్లి డబుల్బెడ్రూం ఇండ్లలో 50 మందికి హక్కు పత్రాలు ఇచ్చారు. కార్యక్రమాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ సురేందర్‌రెడ్డి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శామ్యూల్, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు,
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ కమిషనర్ అవినాష్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య, సింగరేణి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రెడ్డి, భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావు, ఎంపీపీ మందల లావణ్య, కౌన్సిలర్ చల్లూరి మమత, బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు కటకం జనార్దన్, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీ నరసింహారావు, జీఎంఆర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఆశీర్వాదం, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్, గౌరవ అధ్యక్షుడు నీలాంబరం, సీడీపీవో అవంతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి, టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు